TG MLC Elections : పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు - ఓటర్ గా ఇలా నమోదు చేసుకోండి-mlc elections medak nizamabad adilabad karimnagar graduates and teachers constituencies follow the registration process ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections : పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు - ఓటర్ గా ఇలా నమోదు చేసుకోండి

TG MLC Elections : పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు - ఓటర్ గా ఇలా నమోదు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Oct 02, 2024 04:56 PM IST

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ షురూ అయింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు కానున్న నేపథ్యంలో.. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ తెలిపారు.

తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు.సెప్టెంబర్ 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని మెదక్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు.

2025 మార్చి 29 నాటితో ముగియనున్న గడువు.....

పైన పేర్కొన్న నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పించింది. అక్టోబర్ 16, 25వ తేదీలలో రెండు పర్యాయాలు పత్రికాముఖంగా కూడా ప్రకటనలు జారీ చేస్తారని మెదక్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.....!

ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ లో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. https://ceotelangana.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx పై నొక్కితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2024 నవంబర్ 06 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు.

 అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయవచ్చని ఆమె అన్నారు.

డిసెంబర్ 30 న తుది జాబితా........

2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల 30 నుండి 2024 నవంబర్ 06 వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు ఫారం-18 లో, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఫారం-19 లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.

కట్టుదిట్టంగా ఓటరు జాబితా సవరణ: సీఈఓ సుదర్శన్ రెడ్డి

సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా పై సమీక్ష నిర్వహించారు . ఎస్ఎస్ఆర్-2025 లో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. 

మంగళవారం హైదరాబాద్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0 తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా సీ.ఈ.ఓ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియ వేగవంతమయ్యిందని, వారం రోజుల వ్యవధిలోనే 55 శాతం నుండి 95 శాతానికి చేరుకుందని జిల్లా కలెక్టర్లు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ లు, సూపర్ వైజర్లను అభినందించారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.