Mlc Elections In Telangana 2025 : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని చాలా మంది అంచనా వేసినా...బీజేపీ అభ్యర్థి ముందజలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పడినట్లు సమాచారం. కరీంనగర్‌లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారికి విజయవకాశాలు ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది.
ఒక్కొక్క రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. 21 టేబుళ్లలో టేబుల్ కు వెయ్యి చొప్పున ఓట్లను లెక్కిస్తున్నారు. కరీంనగర్ టీచర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో రౌండ్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. రెండవ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1492 లీడ్ లో కొనసాగుతున్నారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని భావించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మూడో స్థానంలో ఉండవచ్చని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అభ్యర్థుల్లో హోరాహోరీగా పోటీపడుతున్నారు.
ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కొనసాగుతున్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ లతో కలిపి 2 లక్షల 52 వేల 100 పోల్ కాగా 28 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అయిన 2 లక్షల 24 వేల ఓట్లలో విజయం సాధించడానికి కావాల్సిన కోటా లక్షా 12 వేల ఓట్లు. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుతో కావాల్సిన కోటా ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం లేదు.
దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావాలంటే రేపు ఉదయం అవుతుంది. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంది. చెల్లుబాటు కానీ ఓట్లలో రౌండప్ చేసినా అండర్ లైన్ చేసిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేయడంతో వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వద్ద నిరంతరాయంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5761 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
ఇప్పటి వరకు 105000 ఓట్ల లెక్కింపు పూర్తి
సంబంధిత కథనం