'మీ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం - ఆ ప్రయత్నాలను సహించరు' - సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్-mla komatireddy raj gopal reddy reaction on cm revanth comments about cm post ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'మీ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం - ఆ ప్రయత్నాలను సహించరు' - సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

'మీ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం - ఆ ప్రయత్నాలను సహించరు' - సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. రాబోయే పదేళ్లు నేనే సీఎం అంటూ.. రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుందంటూ రాసుకొచ్చారు.

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ట్వీట్ చేశారు. కోమటిరెడ్డి ట్వీట్ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

అసలు సీఎం రేవంత్ ఏమన్నారంటే…?

ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. జటప్రోలులో ప్రతిపాదిత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

పాలమూరు జిల్లా బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలన్న ఆయన… తాము చేసే మంచి పనుల గురించి చెబుతుంటే కుమిలి కుమిలి ఏడవాలంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ కడుపులో మంట పెట్టుకొని కళ్లల్లో నీళ్లు కారుస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రిగా తానే పదేళ్లు ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవటం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీనే పదేళ్ల వరకు అధికారంలోకి ఉంటుందని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి… తాజాగా నేను పదేళ్ల వరకు సీఎంగా ఉంటానంటూ చెప్పటంతో ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి స్పందించారు. ఈ తరహా ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఇక గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన సమయంలోనూ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అవినీతిపరుడని… అలాంటి వ్యకి నేతృత్వంలో పార్టీ కోసం ఎలా పని చేస్తామని కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పార్టీ మారిన రాజ్ గోపాల్ రెడ్డి… బీజేపీలో చేరారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ లో చేరి… మునుగోడు ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో మంత్రి పదవిపై రాజ్ గోపాల్ రెడ్డి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. బహిరంగగానే తన మనసులోని మాటను కూడా చెప్పారు. తనకు పదవి ఇవ్వాలని కోరారు. అయితే పదవి రాకుండా జిల్లాకు చెందిన సీనియర్ నేత అడ్డుకుంటున్నారని కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే…! ఇదిలా ఉండగానే తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వటంతో….రాజ్ గోపాల్ రెడ్డి తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.