పిల్లలమర్రి ప్రకృతి రమణీయత.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాల సుందరీమణులు-miss world 2025 competitors visit pillalamarri in mahabubnagar district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పిల్లలమర్రి ప్రకృతి రమణీయత.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాల సుందరీమణులు

పిల్లలమర్రి ప్రకృతి రమణీయత.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాల సుందరీమణులు

చారిత్రాత్మక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని.. ప్రపంచ సుందరి పోటీదారులు సందర్శించారు. వీరికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. పిల్లలమర్రి ప్రత్యేకతలు, చరిత్ర గురించి వారికి వివరించారు. బతుకమ్మ పాటలకు అందాల బొమ్మలు ఆడి పాడి ఆనందించారు.

పిల్లలమర్రి వద్ద వివిధ దేశాల సుందరీమణులు

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు.. వివిధ దేశాల నుండి సుందరీమణులు వచ్చారు. వీరు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. 16 వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఫొటోలు దిగారు. పురావస్తు ప్రదర్శన శాలను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలను తెలుసుకున్నారు. మ్యూజియం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫొటోలు దిగారు.

ఆడిపాడిన అందాలబొమ్మలు..

అనంతరం పిల్లలమర్రి మహా వృక్షాన్ని సందర్శించారు. 700 సంవత్సరాల వయస్సు కలిగిన మహా మర్రి వృక్ష ప్రకృతి అందాలను చూసి.. సుందరీమణులు తన్మయంతో మైమరచిపోయారు. అడుగడుగున తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు బోనాలు, లంబాడ నృత్యం, రంగు రంగుల రంగవల్లి, భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన సుందరీమణులు.. తన్మయంతో పులకించిపోయారు. తెలంగాణ బతుకమ్మ పాటలకు అందాల బొమ్మలు ఆడి పాడి ఆనందించారు. పిల్లల మర్రి చెట్టు చరిత్రను జిల్లా అటవీ శాఖ అధికారి సుందరీమణులకు వివరించారు.

మీ రాక ఎంతో సంతోషం..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. 'తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సుందరీమణుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి విచ్చేసిన పోటీదారులకు స్వాగతం. శతాబ్దాలుగా, లెక్కలేనన్ని మంది సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు ఈ వృక్ష అద్భుతాన్ని సందర్శించారు. మీ రాక మమ్మల్ని చాలా సంతోషపరిచింది. ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. విచ్చేసిన సుందరీమణులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రేమగల ప్రజలు ఉన్న భూమి' అని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు.

ఇదీ పిల్లల మర్రి గొప్పదనం..

'ఈ ప్రకృతి ఒడిలో తిరిగినప్పుడు మీ చుట్టూ ఉన్న విషయాల గురించి.. మీరు కొత్త ఆలోచనలను కనుగొన్నారని అనుకుంటున్నాం. ఇది కచ్చితంగా మంచి అనుభవం. పిల్లల మర్రిని తెలంగాణ ప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక సముదాయంగా అభివృద్ధి చేసింది. చెట్టు, ఆలయం ఆకట్టుకునే కలయికగా ఉన్నాయి. ఈ పవిత్రమైన మర్రి చెట్టు వైభవం, దాని అనేక ఊడలు, కొమ్మలు పచ్చదనంతో నిండిన విశాలమైన విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది భారతదేశంలోనే పురాతనమైన మర్రి చెట్టు' అని మంత్రి వివరించారు.

తీపి జ్ఞాపకాలతో వెళతారు..

'ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలి. పర్యాటకం అనేది కేవలం టూరిస్టులకు మాత్రమే కాదు. ఎంతో మందికి స్వయం ఉపాధి, ప్రాంత సామాజిక అభివృద్ధికి దోహదపడతాయి. పిల్లల మర్రి కేవలం పాలమూరు జిల్లాకు మాత్రమే కాకుండా.. తెలంగాణ రాష్ట్రం, భారత దేశానికి గర్వకారణం. ప్రపంచ సుందరీమణులు ఎన్నో తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళతారు' అని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మరో బృందం హైదరాబాద్‌లోని ఎక్స్పీరియం ఎకో-టూరిజం పార్క్‌ను సందర్శించింది.

సంబంధిత కథనం