ఇండియాలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే శనివారం స్పందించారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను ఖండించారు.
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ఆర్గనైజర్లు కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని మిస్ ఇంగ్లండ్ మిల్లా...ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. పార్టీల్లో ఇద్దరు అందగత్తెలకు ఒక్కో టేబుల్ చొప్పున కేటాయించారని, వారు ఆ టేబుల్ వద్ద కూర్చొన్న అతిథులను అలరించాలని చెప్పారు. ఇలాంటి చోట ఉండలేక పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు ఆమె తెలిపారు.
మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పందించి, ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
మిస్ మిల్లా మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగిన తర్వాత, మిస్ ఇంగ్లాండ్ 1వ రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఆమె ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు.
మిస్ షార్లెట్ బుధవారం ఇండియాకు చేరుకున్నారని, మిస్ వరల్డ్ సోదరభావంతో ఆమెను పోటీలలో పాల్గొనటకు అనుమతించడం జరిగిందని ఈ పోటీలలో ఆమె పాల్గొంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై, కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు, అపవాదకరమైన కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణలను ఖండిస్తూ, ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్ లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయి.
తాజాగా ప్రచురితమైన తప్పుడు కథనాలు నిరాధారమైనవని, ఆ ఆరోపణలను ఖండిస్తూ జూలియా మోర్లే ఆ ప్రకటనలో వివరించారు.
మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, "బ్యూటీ విత్ ఎ పర్పస్" అనే విలువలకు నిబద్ధంగా పోటీలు కొనసాగుతున్నాయి. మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటిస్తూ, తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు తగిన ఆధారాలతో, వివరణతో ధృవీకరించుకోవాలని జూలియా మోర్లే ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం