దేశంలోనే తొలిసారి అనాథ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడతాయని మంత్రులు వివరించారు. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క.
'దేశంలోనే మొదటిసారి అనాథ పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులను హైదరాబాద్‌లో అందించాం. పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులకు అందివ్వడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే ఆధార్ కార్డు ఇచ్చాం. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చాం. ఆరోగ్య శ్రీ కార్డులను ఇచ్చి ఎక్కడైనా చికిత్స పొందేలా చేశాం. హైదరాబాద్‌లో 2200 మంది ఉన్నారు. మీ సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తాం. మీరు చేస్తున్న సర్వీసును ప్రజాపాలన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆలోచనతో ఉంది' అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
'మేము క్షేత్ర స్థాయిలో కస్టపడి పైకి వచ్చాం. సంబంధిత శాఖ మంత్రిగా సీతక్క ఉన్నారు. హైదరాబాద్‌లో తల్లిదండ్రులు ఉదయం లేవగానే పిల్లలను అంగన్వాడీ కి పంపిస్తారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు స్కూళ్లు, భవనాలను వాడుకోవాలి. పెయింట్స్ వేయించాలి. చైల్డ్ కేర్ నెట్ వర్క్ సంస్థలను మరింత మెరుగుపరుస్తాం. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అనాథల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా.. తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ. 4,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అనాథల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి.. వారికి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు.. అనాథల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ఇటీవల ప్రకటించారు.
సంబంధిత కథనం