నేను అలా అనలేదు.. ఐయామ్ సారీ.. మహేశ్ గౌడ్ ఇంట్లో ముగిసిన పొన్నం, అడ్లూరి మధ్య వివాదం!-ministers ponnam prabhakar and adluri laxman controversy end in tpcc chief mahesh kumar goud home ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నేను అలా అనలేదు.. ఐయామ్ సారీ.. మహేశ్ గౌడ్ ఇంట్లో ముగిసిన పొన్నం, అడ్లూరి మధ్య వివాదం!

నేను అలా అనలేదు.. ఐయామ్ సారీ.. మహేశ్ గౌడ్ ఇంట్లో ముగిసిన పొన్నం, అడ్లూరి మధ్య వివాదం!

Anand Sai HT Telugu

కొన్ని రోజులుగా తెలంగాణలో మంత్రుల మధ్య నడుస్తున్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు.

మహేశ్ కుమార్ గౌడ్‌ ఇంట్లో పొన్నం, అడ్లూరి భేటీ

తెలంగాణలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పాలని మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా అయ్యేలా కనిపించింది. దీంతో టీపీసీసీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఇద్దరు మంత్రులు సమావేశం అయ్యారు. మహేశ్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది.

ఈ సమావేశంలో పొన్నం, అడ్లూరి, మహేశ్ గౌడ్‌తోపాటుగా మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి , సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.

క్షమాపణలు కోరుతున్నా

'నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధపడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడి లో పెరగలేదు, కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు. సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన పెడతాం.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఆ అపోహ వద్దు

సామాజిక న్యాయంలో భాగంగా బలహీనవర్గాల కోసం రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. మేమంతా ఐక్యంగా భవిష్యత్‌లో సామాజిక న్యాయం కోసం పని చేస్తామని చెప్పారు. లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నా.. కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గం, మేమంతా కలిసి పెరిగామని గుర్తు చేసుకున్నారు. ఆ అపోహ ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

పొద్దున ఎక్స్ పోస్ట్

అంతకుముందు ఉదయం పూట మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌‌లో ఒక పోస్ట్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదరులవంటివారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తమకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదేనని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందన్నారు.

'నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతి కోసం మేం ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం.' అని పొన్నం అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.