Ministers Karimnagar Visit : త్వరలోనే మరిన్ని చేరికలు - బీఆర్ఎస్ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది - మంత్రులు
Ministers Karimnagar Visit :త్వరలో బీఆర్ఎస్0 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి అన్నారు. బిఆర్ఎస్ పనైపోయిందని వ్యాఖ్యానించారు.
Ministers Kariminnagar Visit : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్ర క్యాబినెట్ లో వన్ థర్డ్ అంటే ఐదుగురు మంత్రులు కరీంనగర్ లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు బిఆర్ఎస్ ను టార్గెట్ గా చేసి మాట్లాడారు.
బిఆర్ఎస్ పనైపోయిందని ఒక మంత్రి అంటే, ఇక క్లోజ్.. పేకమేడలా కూలిపోతుందని మరో మంత్రి అన్నారు. మొత్తానికి త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్వర్గీయ మాజీ ఎంపీ చొక్కారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రైతుభరోసా పై ఉమ్మడి జిల్లా ప్రజల అభిప్రాయ సేకరణకై కరీంనగర్ కు చేరుకున్న మంత్రులు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యే స్థితికి వచ్చిందని, నామమాత్ర పార్టీగా మిగలబోతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అంటే మోసం దగా.. కేటీఆర్ కి చెప్తున్నా... మీరు పదేళ్లలో 25 వేల కోట్లు రుణమాఫీ చేస్తే మేము 8 నెలల్లో 31 వేల కోట్లు చేస్తున్నామన్నారు. కాళేశ్వరంలో పంప్ హౌస్ ల పరిస్థితి పై నివేదిక కోరామని, శుక్రవారం జరిగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్ లో అన్నీ మాట్లాడతామని తెలిపారు. ఎల్లంపల్లి పైన ఉన్న పంప్ హౌస్ లు కాలువలు అన్నీ వాడతామన్నారు.
ఆయకట్టు స్థిరీకరణ విషయంలో గత ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెప్పారని, కాళేశ్వరం నుంచి పంపింగ్ చేసిన నీటి కంటే వదిలేసిన నీరే ఎక్కువ అని తెలిపారు. ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీల నీరు మాత్రమే వాడారని చెప్పారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే ఏటా10వేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని... ప్రజలపై ఇంత భారం మోపారు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ ని ఇంటికి పంపారని తెలిపారు.
తెలంగాణ రైతాంగ విషయంలో ఒక విప్లవాత్మక చర్య తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నామన్నారు. కార్పొరేట్ రంగానికి ఇచ్చిన రుణమాఫీ రైతులకు ఎందుకు ఇవ్వరు అని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. 12 లక్షల కోట్లు కార్పొరేట్ల కు మోడీ సర్కారు సబ్సిడీ పేరుతో మాఫీ చేసిందని తెలిపారు.
రేషన్ కార్డు అంశంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నాయని కొత్త రేషన్ కార్డులు త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేర్వేరుగా ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రతీ నెలా జిల్లా అభివృద్ధి పై సమీక్షలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసింది- మంత్రి పొంగులేటి
గత ప్రభుత్వం కేంద్రంతో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గతంలో మాదిరిగా కాకుండా రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. మాటలతో కాకుండా మేము చేతలతో నిరూపించాం.. రుణమాఫీ చేశామన్నారు.
గత పదేళ్ల పాలనను తలదన్నేలా పని చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి ప్రాజెక్టుల అవినీతి లాంటి అనేకం విధ్వంసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నామ మాత్రంగా కూడా మిగలదని, పేకమేడలా కూలిపోతుందన్నారు. వారే కూల్చుకుంటున్నారని తెలిపారు. ధనిక రాష్ట్రం అని బయటకి గొప్పలు చెప్పి లోపల అప్పులు చేసిందన్నారు.
కేంద్రం నుండి సాయం అడిగితే నామోషీ అని మిషన్ భగీరథ లాంటి వాటికి నిధులు అడగలేదన్నారు. గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ పథకం నీళ్లు ఇంకా 30 శాతం మందికి చేరలేదని చెప్పారు. వేలాది కోట్ల ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నాలుగు గోడల మధ్య మేము నిర్ణయాలు చేయడం లేదన్నారు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని తెలిపారు.
విచారణ అనంతరం చర్యలు - మంత్రి శ్రీధర్ బాబు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఎంక్వయిరీ జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు సేకరిస్తున్నారని నివేదిక వచ్చిన తర్వాత ఏం చేస్తామో.. అన్ని చెప్తామన్నారు.
గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మించిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కట్టారు.. ఎక్కడ లోపాలు జరిగాయి.. ఎక్కడెక్కడ ఏమైంది అనేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. విచారణ నివేదిక అనంతరం చర్యలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.