Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు మహర్దశ.. ఈనెల 30 కీలక నిర్ణయం!
Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ రాబోతుంది. పెండింగ్ ప్రాజెక్టులపై ఈనెల 30న ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించనున్నారు. వచ్చే ఏడాదిలోగా అదనంగా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గత బీఆర్ఎస్ సర్కార్ వలే ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులకు నిధులు వినియోగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతోనే సాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరిట లక్షలాది కోట్లు ప్రజాధనం వృథా చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. తాము అలా కాకుండా తక్కువ ఖర్చుతో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి.. చేసి ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1,81,000 కోట్లను ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టును మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా ఆరోపణలు రాకుండా ముందు జాగ్రత్తగా సీఎం నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలగనుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ టు ఫేజ్ వన్ పనులు త్వరితగతిన పూర్తిచేసి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 1,51,400 ఎకరాలకు ఈ సంవత్సరంలోనే సాగునీరు అందించే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. కాళేశ్వరం ప్యాకేజీ 9, 10, 11లో పనులు పూర్తిచేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికలతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల కు పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంది. ఇకపై రైతులు సాగునీటికి ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
రైతన్న సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పనులను స్పీడ్ అప్ చేయనుంది. ఎన్ని నిధులు అవసరమో వాటి అంచనాల ప్రకారం ప్రభుత్వం తక్షణమే విడుదల చేయనుంది. 9వ ప్యాకేజీ పనులు 83 శాతం, కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనులు 83 శాతం పూర్తయ్యాయి. మరో ఏడాదిలో రూ.340 కోట్లు ఖర్చు పెట్టి 80 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు ప్రభుత్వం సాగునీరు అందించనుంది.
మరో ప్రాజెక్ట్ కలికోట- సూరమ్మ ప్రాజెక్టుకు రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.30 కోట్లు నిధులను ఖర్చు చేసి పెండింగ్ పనులను పూర్తి చేయనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ 2 ఫేస్ 1 పనులు పూర్తిచేసి 1.51లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజీ 2లో పెండింగ్ పనులకు రూ.170 కోట్లు ఖర్చు చేసి, వేములవాడ నియోజకవర్గంలో 40,500 ఎకరాలు, కోరుట్లలో 2,500 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
30న ఉత్తమ్ సమీక్ష..
జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ ఈనెల 30న జిల్లాకు రానున్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో సమీక్ష చేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఎక్కడ వరకు వచ్చాయి.. వాటికి సంబంధించిన నిధులు ఎంతవరకు అవసరమో.. వాటిని ఎన్ని రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.. అనే అంశాలపై చర్చించనున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఈనెల 30న జిల్లాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తానికి వేములవాడ సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా.. పెండింగ్ ప్రాజెక్టులన్ని ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే తమకు సాగునీటి బాధ తప్పుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(రిపోర్టింగ్-కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)