భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోని దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పాల్గొన్నారు. పామాయిల్ రైతుల అనుభవాలు, ఆయిల్ ఫెడ్ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి తుమ్మల. ఈ సందర్భంగా మాట్లాడారు.
'తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా ఆయిల్ పామ్ సాగవుతోంది. మన దేశానికి వంట నూనెలు దిగుమతి చేసుకోకుండా ఆయిల్ పామ్ సాగుతో స్వయం సమృద్ధి సాధించవచ్చు. ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయల విలువ గల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి టార్గెట్‌గా పెట్టుకున్నాం.' అని మంత్రి తుమ్మల మాట్లాడారు.
యూరియా కారణంగా క్యాన్సర్ మహమ్మారి ప్రబలుతోందని మంత్రి తుమ్మల అన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ క్యాన్సర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పురుగుల మందుల ఎరువులు ఎక్కువ వినియోగంతో అన్నదాతలు క్యాన్సర్, అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం బాట పట్టాలని పిలుపునిచ్చారు.
ఆయిల్‌పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 13 కంపెనీల ప్రతినిధులతో ఇటీవలే మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వచ్చే మూడు సంవత్సరాలలో మరో 7.28 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.72 లక్షల ఎకరాల్లో 73,696 మంది రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏటా రెండు లక్షల కంటే ఎక్కువ సాగుచేయాలని లక్ష్యంతో పని చేయాలన్నారు. వచ్చే మూడు సంవత్సరాలలో సాగు విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు చేరాలన్నారు. కంపెనీలు నర్సరీతో నాణ్యమైన మెుక్తలను రైతులకు అందించాలన్నారు. సందేహాల నివృత్తి కోసం సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.