Medaram Jatara: రెండు నెలల్లో మేడారం జాతర.. పనులపై రాష్ట్ర సర్కారు ఫోకస్
Medaram Jatara:రెండేళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సమయం దగ్గర పడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఫిబ్రవరి లోనే జరగనుండగా.. ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది.
Medaram Jatara: ఈ ఏడాది జులైలో కురిసిన వర్షాలకు మేడారంలో రోడ్లు, విద్యుత్తు స్తంభాలు అన్నీ ధ్వంసం కావడంతో అధికార యంత్రాంగం పనులపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇలాకాలోనే ఈ జాతర జరగనుండగా.. సోమవారం హైదరాబాద్ లో మంత్రి మేడారం పనులపై రివ్యూ చేసి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.
ఫిబ్రవరి 21 నుంచి జాతర
2022లో మేడారం జాతర జరగగా.. మళ్లీ 2024లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజు మండె మెలిగె, గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతర ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాలని మేడారం పూజారులు నిర్ణయించారు. ప్రతిసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవార్లను దర్శించుకునే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది.
కాగా జాతరలో మొదటిరోజు కన్నెపల్లి ప్రాంతం నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. ఆ తరువాతి రోజు చిలకలగుట్ట దగ్గర ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. మూడో రోజు భక్తులు గిరిజన తల్లులు సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. నాలుగు రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకు కోట్లాది జనం వస్తుండగా.. జాతరకుజాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.
చేతులెత్తేసిన బీఆర్ఎస్ సర్కారు
మేడారం.. తెలంగాణ సంప్రదాయాలకు అద్దం పట్టే జాతర. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా బీఆర్ఎస్ సర్కారు మేడారం జాతరకు నామమాత్రంగానే నిధులు కేటాయించి, తాత్కాలిక పనులపైనే దృష్టి పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఈ ఏడాది జులైలో కురిసిన వర్షాలకు మేడారం పరిసరాలన్నీ దెబ్బతిన్నాయి.
వరదలు ముంచెత్తి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. జంపన్నవాగు వద్ద నిర్మించిన కల్యాణ కట్టలు, జంట వంతెనలు కూడా నాశనం అయ్యాయి. అక్కడున్న హరిత హోటల్ పూర్తిగా దెబ్బతింది. వీటన్నింటికీ రిపేర్లు చేయాల్సి ఉంది. మొత్తం రిపైర్లు, నిర్వహణ కోసం రూ.75 కోట్లు అవసరమని అప్పట్లోనే అధికారులు ప్రతిపాదనలు పంపినా అప్పుడు అధికారంలో ఉన్న బీఆరెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడంతో నిధులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జాతర సమీపిస్తున్నా పనులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి.
మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న స్థానిక శాసన సభ్యురాలు సీతక్క మేడారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన ఇలాఖాలో జరగనున్న అతి పెద్ద జాతర కావడంతో ఉన్న కొద్దిసమయంలో పనులు తొందరగా పూర్తి చేసేందుకు హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర పనులు స్పీడప్ చేయాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్ లను ఆదేశించారు.
జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఘాట్ల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగిన ఆదేశాలిచ్చారు. ఇదివరకు జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే నిర్వహించేలాచూడాలని, దాంతో భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
జాతీయ హోదాకు కృషి చేస్తా: సీతక్క
కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేస్తానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు, చీఫ్ ఇంజినీర్ శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)