మంత్రి సీతక్క.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, స్త్రీ, శిశు సంక్షేమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు చేసిన పనులు క్వాలిటీగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అధికారులు డెడ్ లైన్ పెట్టి కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని.. మంత్రి సీతక్క ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎస్సీ డెవలప్మెంట్ కింద ఇచ్చిన సీసీ రోడ్లను అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని.. వారం రోజుల్లో అన్ని టెండర్లు పూర్తి చేసుకుని పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు. స్టార్ట్ చేసిన పనులను వచ్చే రెండు, మూడు నెలల్లోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆఫీసర్లకు సూచించారు.
రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీవోలు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ములుగు జిల్లాలో మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని.. స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీలతో కలిసి ప్రారంభించిన్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు సీతక్క.
అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్న బాలామృతాన్ని పిల్లలు ఇష్టంగా తినడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని సీతక్క వ్యాఖ్యానించారు. చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ మేరకు బాలామృతంలో మార్పులు చేస్తామని.. చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఉన్న సీడీపీవోలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. బాలామృతంపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల్లో ఎదుగుదల ఉండేలా చూసుకోవాలని, చిన్నారుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మళ్లీ వచ్చే ఏడాది నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఏమీ ఉండవనే భావనతో చిన్నారులను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని, చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు యూనిఫామ్స్, స్కూల్ బుక్స్, ఆట వస్తువులను ఇస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు. అయినా డబ్బులు పెట్టి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ సెంటర్లలో కల్పిస్తున్న సదుపాయాలను గురించి ప్రజలకు తెలియజేయాలని ఆఫీసర్లకు సూచించారు. తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)