Ponnam Prabhakar: తెలంగాణలో నూతన స్క్రాప్ పాలసీ తీసుకొచ్చి 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కింద తీసుకుని రాయితీ పై కొత్త వాహనం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ కు 100 శాతం టాక్స్ మినహాయింపు తెలంగాణలోనే ఇస్తున్నామని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖుస్థాపన చేశారు. జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్క్ ను ప్రారంభించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, డిటిసి పురుషోత్తంతో కలిసి హెల్మెట్ ల పంపిణీ చేశారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పై పిల్లలకు అవగాహన కల్పిచారు. విద్యార్థి దశలోనే రోడ్డు నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
వాహనాల టెస్టింగ్ మాన్యువల్ గా జరుగుతుందని రాష్ట్రంలోనే మొదటిసారి 8 కోట్లతో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ తిమ్మాపూర్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ పై ఈ మధ్య ఢిల్లీలో చూశాం... రాష్ట్రపతికి లైసెన్స్ కావాలన్నా అక్కడ టెస్ట్ పాస్ కావాల్సిందేనని తెలిపారు.
తెలంగాణ రవాణా శాఖ త్వరలో ఎన్ఐసి కింద వాహన సారథి లోకి పోతుందని చెప్పారు. లక్షలాది మంది పోలీసులు ఉన్నా రోజుకు కనీసం 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి 97 మంది AMVI లను నియమించుకుని శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ , ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, మన ప్రాణాలను మనం కాపాడుకోవడం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.
కరీంనగర్ కేసిఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చిందంటున్న కేటిఆర్, కరీంనగర్ కు పదేళ్ళ పాలనలో చేసిందేమిటో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసిఆర్ ను రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే కరీంనగర్ గడియారం సాక్షిగా నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనని చెప్పిన కేసిఆర్ కరీంనగర్ కు చేసిన మేలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలు సిద్దిపేట, జగిత్యాల, గోదావరిఖని అన్ని ప్రాంతాల్లో ఇచ్చే వరకు కరీంనగర్ కు ఎందుకు ఇవ్వలేదని,
ఎవరు అడ్డంపడ్డారని ప్రశ్నించారు. కరీంనగర్ కు సంబంధించి అప్పర్ మానేర్ పూర్తి కాకుండానే రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ఎందుకు పూర్తయ్యాయని ప్రశ్నించారు.
కరీంనగర్ ప్రజలు రాజకీయ పునర్జన్మ ఇస్తే కరీంనగర్ రామగుండం రొడ్డును ఎందుకు 8 లైన్ల రొడ్డుగా మార్చి లేదన్నారు. శాతవాహన యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలని ఆనాడే మేం తీర్మానం చేసిన మీరు శాతవాహన యూనివర్సిటీ కి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజి ఇవ్వలేదని ప్రశ్నించారు. కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ లాగ చేస్తామన్నారు ఎందుకు చేయలేదన్నారు. పోలీసులు హరాష్ చేస్తున్నారని అంటున్న కేటిఆర్..గతంలో భూ ఆక్రమణ కేసులపై ఎందుకు స్పందించలేదని, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు.
భూ ఆక్రమణ దారులకు మీరు మద్దతు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మీరు చెప్పినట్టు వినకపోతే అమాయకులను వేధించడమే కాదు వారి పాలిట శాపంగా మారారని విమర్శించారు. రాజకీయంగా పార్టీ పుట్టింది కరీంనగర్ లో రాజకీయంగా మీరు ఎదిగింది కరీంనగర్ లో మరి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ స్పందించాలని కోరారు.
తెలంగాణలో ఆర్థిక సంక్షోభానికి బిఆర్ఎస్, కేసిఆర్ కుటుంబ పాలనే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ప్రత్యేకించి కరీంనగర్ లో బిఆర్ఎస్ పాలనలో రైతులు ధాన్యం తూకంలో మోసపోయారని తెలిపారు. సివిల్ సప్లై మంత్రిగా ఉండి కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏమైనా ఆపారా అని ప్రశ్నించారు. 25 సంవత్సరాల పార్టీలో పదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా విజయోత్సవాలు చేస్తారా అని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలపై విజయోత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
కుటుంబ నియంత్రణ పాటించడమే పాపం అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. డిలిమిటేషన్ పేరుతో ఎంపీ స్థానాలు తగ్గిస్తే ఊర్కోమని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని అడుగుతున్నా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలను పెంచాల్సింది పోయి తగ్గించడం మంచిది కాదన్నారు. దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కుటుంబ నియంత్రణ ఆదేశాలను పాటించాయని తెలిపారు. 1971 జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేయాలని కోరారు. లేదంటే ఇప్పుడున్న ఎంపీ స్థానాల ప్రకారం చేయాలన్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం