TG Caste Survey : కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప.. ఎవరూ వివరాలు ఇవ్వలేదు : పొన్నం ప్రభాకర్
TG Caste Survey : తెలంగాణ ప్రభుత్వం దాదాపు 50 రోజుల పాటు కులగణన సర్వే చేపట్టింది. దీన్ని రేవంత్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన రాజకీయ పార్టీల పెద్దలు కుల గణన సర్వేలో వివరాలు ఇవ్వలేదని.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప.. ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలిన వారూ ఉన్నారని ఆరోపించారు. సహాయ నిరాకరణ లాగా.. కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టాండ్ ఏంటో చెప్పాలి..
'కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి. బలహీన వర్గాల కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమం లాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కుల గణన చేస్తామని మాట ఇచ్చాం. చేసి చూపించాం' అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఉత్సవాలు జరపండి..
'కుల గణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. కుల గణన కోసం పోరాటం చేసిన వారందరికీ హ్యాట్సాఫ్. నిర్ణయం నుండి నివేదిక దాకా కుల గణన ప్రక్రియలో ఉన్నందుకు గర్వంగా ఉంది. బీసీ సోదరులందరూ ఉత్సవాలు జరపాలి. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాం. దీని ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
ఎంతమందిని సర్వే చేశారు..
తెలంగాణలోని మొత్తం 3,54,77,554 మందిని సర్వే
మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు
కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం
సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం
ఎవరు ఎంతమంది..
ఎస్సీలు 17.43 శాతం
ఎస్టీలు 10.45 శాతం
బీసీలు 46.25 శాతం
ఓసీలు 15.79 శాతం
ముస్లిం మైనారిటీలు బీసీల జనాభా 10.08 శాతం
ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం