అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను.. అదే ఫైనల్ : మంత్రి పొన్నం-minister ponnam prabhakar dont want to respond on adluri lakshman comments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను.. అదే ఫైనల్ : మంత్రి పొన్నం

అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను.. అదే ఫైనల్ : మంత్రి పొన్నం

Anand Sai HT Telugu

తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అయితే తాజాగా పొన్నం ప్రభాకర్ ఈ వివాదంపై మాట్లాడారు.

మంత్రి పొన్నం ప్రభాకర్(ఫైల్ ఫొటో)

తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒకరు అంటుంటే.. నేను అలా అనలేదని మరొకరు చెబుతున్నారు. తనకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ విధించగా.. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివాదంపై మాట్లాడారు. అడ్లూరి వ్యాఖ్యలపై తాను స్పందించనని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు తనతో మాట్లాడారని, అదే ఫైనల్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రహ్మత్‌నగర్ భేటీలో ఏం జరిగిందో ఆయనకు తెలిపినట్టుగా వెల్లడించారు. 'అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై నేను స్పందించను. పార్టీ పరంగా మాకు మహేశ్ గౌడ్ ఆదేశాలు శిరోధార్యం.' అని పొన్నం చెప్పారు.

తనపై మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తమ జాతిని మొత్తాన్ని అవమానపరిచాడని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. “నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం నా తప్పా? పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి. పొన్నం మా జాతిని మొత్తాన్ని అవమానపరిచాడు.. ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి.' అని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు.

తాను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడని పేర్కొన్నారు. సహచర మంత్రిని అంత మాట అన్నా.. వివేక్ చూస్తూ ఊరుకున్నాడని, దీనిపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

వివాదం మెుదలైంది ఇలా

ఇటీవలే మంత్రులు పొన్నం, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే నిర్ణయించిన సమయంలోపే మంత్రులు పొన్నం, వివేక్ అక్కడికి వచ్చారు. మంత్రి లక్ష్మణ్ సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్‌ తో మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్ అయింది.

ఈ వివాదంపై మంత్రి పొన్నం వెంటనే స్పందించారు. తాను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా స్పందించారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనకు ఫోన్ చేసి బాధపడ్డారని కూడా తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో మంత్రుల మధ్య మాటల వివాదంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫైనల్‌గా అడ్లూరి వ్యాఖ్యలపై తాను స్పందించనని వివాదానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై మళ్లీ మంత్రి అడ్లూరి ఏమైనా స్పందిస్తారా? ఇంతటీతో ఊరుకుంటారా? చూడాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.