TG Electric Vehicles : ఢిల్లీలో కాలుష్యంతో స్కూల్స్ బంద్ చేస్తున్నారు.. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దు : పొన్నం-minister ponnam prabhakar appeals to the people of telangana to use electric vehicles ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Electric Vehicles : ఢిల్లీలో కాలుష్యంతో స్కూల్స్ బంద్ చేస్తున్నారు.. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దు : పొన్నం

TG Electric Vehicles : ఢిల్లీలో కాలుష్యంతో స్కూల్స్ బంద్ చేస్తున్నారు.. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దు : పొన్నం

Basani Shiva Kumar HT Telugu
Nov 19, 2024 11:16 AM IST

TG Electric Vehicles : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. దీంతో స్కూల్స్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దంటే.. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చామని వివరించారు.

ఎలక్ట్రిక్ వాహనాలు
ఎలక్ట్రిక్ వాహనాలు (istockphoto)

తెలంగాణ ప్రజలు ప్రజలు ఈవీ వాహనాలను వినియోగించాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్న పొన్నం.. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేయించాలని కోరారు. హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

'తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి.. ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చాం. గతంలో 2020- 2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

'కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలని ప్రణాళికలు తెచ్చాం. ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ,2 వీలర్స్, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికిల్, ట్రై గూడ్స్ వెహికిల్స్‌కు టాక్స్ మినహాయింపు ఉంది. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో.. ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడుతున్నారు' అని మంత్రి పొన్నం వివరించారు.

'భవిష్యత్ తరాలకు కాలుష్యం నుంచి విముక్తిని ఇవ్వండి. 15 సంవత్సరాల దాటిన వాటిని స్క్రాప్ చేయండి. ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో 4 రాష్ట్రాలు తిరిగాం. వికాస్ రాజ్, సురేంద్ర మోహన్ కలిసి బెస్ట్ పాలసీ తెస్తున్నారు. దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారు. రోడ్ సేఫ్టీపై లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం' అని మంత్రి వ్యాఖ్యానించారు.

'తెలంగాణలో ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలి. ఈవీ వాహనాలకు సంబంధించి గతంలో 5 వేల వెహికిల్స్‌కే టాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వస్తున్నాయి. వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తాం' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

Whats_app_banner