Invitation to KCR : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం-minister ponnam invites kcr to telangana thalli statue unveiling ceremony ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Invitation To Kcr : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం

Invitation to KCR : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం

Invitation to KCR : చివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు.

కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న పొన్నం ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి.. ఆహ్వాన పత్రికను అందజేశారు.

కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి.. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కేసీఆర్ ఆతిథ్యమిచ్చి గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు.

హైకోర్టులో పిటిషన్..

తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం నడుస్తోంది. సచివాలంయో విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలని.. జూలూరి గౌరీశంకర్‌ పిటిషన్‌ వేశారు. విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. విగ్రహంలో మార్పులంటే.. తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడి అని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.

సర్వం సిద్ధం..

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఎల్లుండి (9వ తేదీన) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉంది.

కేటీఆర్ సెటైర్లు..

'రేవంత్ రెడ్డి ప్రతిష్టించబోయేది తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.