Minister Ponguleti: కరీంనగర్ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి అసహనం..చర్యలు షురూ.. ఆరుగురు అధికారులకు మెమోలు జారీ…
Minister Ponguleti: కరీంనగర్ లో రెండు రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలో కలెక్టర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేయడంపై బక్క జడ్సన్ జాతీయ మహిళా కమీషన్ కు పిర్యాదు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులకు కలెక్టర్ మెమోలు జారీ చేశారు.
Minister Ponguleti: స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ లో రెండు రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 24 గంటలు వాటర్ సప్లై, కుమర్వావాడి స్కూల్లో డిజిటల్ క్లాసుల ప్రారంభం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. దీంతో మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్పీ ఎక్కడా? అని ఆరా తీశారు.

అందుబాటులో సిపి లేకపోయేసరికి మంత్రి ఆగ్రహంతో కలెక్టర్ పమేలా సత్పతి పై అసహనం ప్రదర్శించారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా మందలించారు. అదే సమయంలో మంత్రి పొన్నం కలగజేసుకుని కనీసం ఏసిపి కూడా లేడంటూ అధికారులకు చురకలంటించారు. మంత్రులు అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కలెక్టర్ ఎమోషనల్ పోస్ట్..
కలెక్టర్ పై మంత్రి పొంగులేటి అసహనంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఇన్ స్టా లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'నేను మహిళను. సందర్భానికి తగినట్టు ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరిగిపోగలను' అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారు. ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే కలెక్టర్ ఆ పోస్టును ఇన్ స్టా ఖాతా నుంచి తొలగించారు.
కలెక్టర్ మెమోలు జారీ...
మంత్రుల పర్యటనలో అధికారుల అలసత్వంపై కలెక్టర్ పమేలా సత్పతి అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఆరుగురు అధికారులకు మెమోలు జారీ చేశారు. కరీంనగర్ టౌన్ ఏసిపి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి, డిఈవో, డిఆర్డీవో లను సంజాయిషీ కోరుతూ మెమోలు ఇచ్చారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తినట్లు భావిస్తున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా అలసత్వం పై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ మెమోలు జారీ చేయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి మెడకు ఉచ్చు బిగిస్తుందోనని సర్వత్రా చర్చ సాగుతుంది.
మంత్రిపై మహిళా కమీషన్ కు పిర్యాదు...
కరీంనగర్ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయింది. మంత్రుల పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలతో కలెక్టర్ ఆరుగురు అధికారులకు మెమోలు జారీ చేయడం, అటు మంత్రి పొంగులేటి పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)