అవినీతికి ఆస్కారం లేకుండా.. పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ : పొంగులేటి-minister ponguleti srinivasa reddy key comments on indiramma housing scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అవినీతికి ఆస్కారం లేకుండా.. పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ : పొంగులేటి

అవినీతికి ఆస్కారం లేకుండా.. పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ : పొంగులేటి

పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ అని.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 22 వేల కోట్ల రూపాయల‌తో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి.. శిక్ష‌ణ పొందిన అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికేట్ల అంద‌జేశారు.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి

భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున రూ.5 లక్ష‌ల‌తో సంవ‌త్సరానికి నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. అని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వివరించారు. పేదలు ఆత్మ‌గౌర‌వంతో బ‌తకాల‌న్న సంక‌ల్పంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఈ ఏడాది 22 వేల కోట్ల రూపాయల‌తో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించ‌బోతున్నామ‌ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి మ‌రికొద్ది రోజుల్లో ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే పైల‌ట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయ‌ని వివరించారు.

అవినీతికి ఆస్కారం లేకుండా..

హౌసింగ్ కార్పొరేష‌న్‌లో ఔట్ సోర్సింగ్‌ పద్ధతిలో నియామ‌క‌మైన 350 మంది అసిస్టెంట్ ఇంజ‌నీర్లకు.. నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో ఆరు రోజుల పాటు శిక్ష‌ణ ఇచ్చారు. శ‌నివారం నాడు న్యాక్‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి శిక్ష‌ణ పొందిన ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికేట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా.. అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేయాలని సూచించారు. పేద‌వాడి చిర‌కాల కోరిక నెర‌వేరుస్తున్న ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకంలో భాగ‌స్వాములు కావాల‌ని స్పష్టం చేశారు.

మహిళలే ఉండటం సంతోషం..

ఎంపికైన 350 మంది ఇంజ‌నీర్ల‌లో 45 శాతం మ‌హిళ‌లే ఉండ‌డం సంతోషించ‌దగ్గ విష‌య‌మ‌ని.. మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎన్ని వ‌త్తిళ్లు వ‌చ్చినా కూడా మెరిట్ ప‌ద్ద‌తిలోనే ఎంపిక చేశామని చెప్పారు. ఏ రాష్ట్రంలో అయినా సంక్షేమ ప‌థకం కింద ఒక్క ల‌బ్దిదారునికి 5 ల‌క్ష‌ల రూపాయలు ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. ఇండ్ల ప‌థకాల్లో కూడా కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే అన్ని రాష్ట్రాలు స‌రిపెడుతున్నాయ‌ని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం 5 ల‌క్ష‌ల రూపాయల‌తో 400 చ‌ద‌ర‌పు అడుగుల‌కు త‌గ్గ‌కుండా.. ల‌బ్దిదారుడే నిర్మించుకునేలా ప‌థకాన్ని రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు.

త్వరలో ఫైనల్ జాబితా..

ఇందిర‌మ్మ ఇండ్ల కోసం కొద్దిరోజుల్లోనే నాలుగు ల‌క్ష‌ల మంది జాబితా ఫైన‌ల్ చేయ‌బోతున్నామ‌ని మంత్రి పొంగులేటి వివరించారు. విధుల్లో చేరిన వెంట‌నే అసిస్టెంట్ ఇంజ‌నీర్లు ఈ జాబితాల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. ఎలాంటి ప్ర‌లోభాలు, ఒత్తిళ్ల‌కు గురికాకుండా.. అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇండ్లు ల‌భించేలా క్షేత్ర‌స్ధాయిలో ప‌నిచేయాల‌ని ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తులు ప్ర‌మేయానికి ఆస్కారం లేకుండా ఉండేలా.. అత్యాధునిక‌ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్నామ‌ని వివరించారు. వివిధ ద‌శ‌ల్లో నిర్మాణం పూర్తి చేసుకున్నల‌బ్గిదారుల‌కు.. ప్ర‌తి సోమ‌వారం చెల్లింపులు చేస్తున్నామ‌ని చెప్పారు.

నిర్మాణంలో మెళకువలు..

నిర్మాణ రంగంలో త‌నకున్న అనుభ‌వంతో.. త‌క్కువ ఖ‌ర్చు, నాణ్య‌త‌తో ఇండ్ల‌ను ఎలా నిర్మించాలో మంత్రి వివరించారు. యువ ఇంజ‌నీర్లు ఈ అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించి.. ల‌బ్దిదారుల‌కు అవ‌గాహ‌న కల్పించాల‌ని ఆదేశించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో 21 మందికి ప్ర‌భుత్వం ప‌దోన్న‌తులు కల్పించింది. గ్రేడ్ -2లో ప‌నిచేస్తున్న‌10 మంది స‌బ్ రిజిస్ట్రార్ల‌ను గ్రేడ్‌-1కి, సీనియ‌ర్ స‌హాయ‌కులు ప‌నిచేస్తున్న 11 మందికి గ్రేడ్‌-2 ప‌దోన్న‌తులు క‌ల్పించింది. వీరికి మంత్రి శ్రీనివాస రెడ్డి ప‌దోన్న‌తి స‌ర్టిఫికేట్ల‌ను అంద‌జేశారు.

సంబంధిత కథనం