Ponguleti Srinivas Reddy : కేటీఆర్ ఎవరి కాళ్లు మొక్కడానికి దిల్లీ వెళ్లారో తెలుసు, మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy : కేటీఆర్ దిల్లీలో ఎవరి కాళ్లు మొక్కడానికి వెళ్లారో మాకు తెలుసని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం, కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములూ-ఈ రేసింగ్ సంస్థకు రూ.55 కోట్లు కేటీఆర్ ఏ విధంగా మళ్లించారని ప్రశ్నించారు.
"కేటీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు దిల్లీకి వెళ్లారు? ఎవరి కాళ్లు మొక్కి ఏం లబ్ధి పొందుదామని వెళ్లారు? లిక్కర్ స్కాం కేసులో కేంద్ర పెద్దలను ఒప్పించి తన చెల్లి బెయిల్ పొందినట్లుగానే తనను తాను కాపాడుకోవడానికి కేటీఆర్ మళ్లీ దిల్లీ వెళ్లారు?" అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరి మంత్రి పొంగులేటి కేటీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా - ఈ రేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు రూ.55 కోట్లను ఏవిధంగా మళ్లించారని మంత్రి ప్రశ్నించారు. కేబినేట్ అప్రూవల్, ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండా కేటీఆర్ విదేశాల్లోని తొత్తు సంస్థలకు నిధులు మళ్లించారని దుయ్యబట్టారు.
ఫార్ములా - ఈ రేసింగ్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం అంశంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించిందని తెలిపారు. ఫార్ములా - ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించిన కంపెనీతో MOU కుదుర్చుకోకమునుపే కేటీఆర్ నిధులను మళ్లించారని విమర్శించారు. ఎవరి అనుమతి తీసుకోకుండా ఎవరి కోసం రూ. 55 కోట్ల ప్రజా ధనాన్ని మళ్లించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారించాలంటే దర్యాప్తు సంస్థలకు గవర్నర్ అనుమతి ఉండాలని, అందుకే ముందస్తుగా ఏసీబీ అనుమతి కోరినట్లు పేర్కొన్నారు. రేపో మాపో గవర్నర్ అనుమతి వస్తుందని ముందే గ్రహించిన కేటీఆర్ హైదరాబాద్ నుంచి దిల్లీకి తన బేస్ క్యాంప్ మార్చారన్నారు.
మా దగ్గర ఆధారాలున్నాయి
అంబానీ, అదానీ, ఆర్ఎస్స్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా - ఈ రేసింగ్ కేసు నుంచి తప్పించాలని ప్రాధేయపపడేందుకే కేటీఆర్ దిల్లీకి వెళ్లారని దుయ్యబట్టారు.
అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పొంగులేటి స్పష్టం చేశారు. "నేను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్ కు తెలుసు.. గత ప్రభుత్వం పదేళ్ల హయాంలో చేసిన అవినీతి బాగోతాన్ని వెలికితీస్తే భూమి మీద నుంచి అంతరిక్షంకు వెళ్లి దాక్కునేలా ఉన్నారు." అని పొంగులేటి ఎద్దేవా చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి తనపై కేసు కాకుండా చూడాలని కేటీఆర్ ప్రాధేయపడుతున్నారని పేర్కొన్నారు. అసలు కేటీఆర్ కు ఆయనతో పనేంటని ప్రశ్నించారు. ఏడేడు లోకాల ఆవల ఉన్నా చట్టం కేటీఆర్ ను వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం