ప్రతి రైతు భూమికి 'భూధార్' నెంబర్ ఇస్తాం - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి-minister ponguleti srinivas reddy said that every farmer land will be given a bhudhar number ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రతి రైతు భూమికి 'భూధార్' నెంబర్ ఇస్తాం - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

ప్రతి రైతు భూమికి 'భూధార్' నెంబర్ ఇస్తాం - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

ప్రతి రైతు భూమికి భూధార్ నెంబర్ కేటాయిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతుల సమస్యలను తీర్చేందుకు అధికారులే గ్రామాలకు వస్తున్నారని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని ప్రకటించారు.

ప్రతి రైతు భూమికి ఒక భూధార్ నెంబర్ - మంత్రి పొంగులేటి

వచ్చే ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భూభారతితో భూసమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ప్రతి భూమికి భూధార్ నెంబర్ - మంత్రి పొంగులేటి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ లో అధికారులే గ్రామాలకు వచ్చి సర్వే చేస్తారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగనవసరంలేదన్నారు. ప్రతి రైతు భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తామని తెలిపారు.

“రాష్ట్రం లో 413 రెవెన్యూ గ్రామాలలో నక్షలు లేవు, అయిదు గ్రామాలను నక్షల కోసం సర్వే చేసేందుకు ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ములుగుమాడుకు కూడ ఒక్క నక్ష తయారు చేసి ఇస్తాం. ప్రతీ రెవెన్యూ విలేజ్ కి ఒక గ్రామపాలన అధికారిని నియమిస్తాం. 3,556 మంది నియామకం చేస్తున్నాం. ఇక ప్రభుత్వ రెవెన్యూ అధికారులు రైతులకు అండగా వారి భూములకు కాపలాదారుడుగా ఉంటారు” అని మంత్రి పొంగులేటి వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేకున్నా ఉన్నట్లుగా గత ప్రభుత్వంలోని నేతలు సృష్టించారని మంత్రి విమర్శించారు. రైతుబంధు కోసం పెద్దల సహకారంతో అక్రమాలు చేశారని ఆరోపించారు. ఆనాడు ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇచ్చిన భూములను ధరణితో అక్రమంగా తారు మారు చేశారన్నారు.

భూ భారతి చట్టం పేదల చుట్టం మాదిరిగా పని చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ లో కూడా మార్పులు తీసుకువస్తున్నామన్నారు. స్లాట్ బుకింగ్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రకియ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తూనే కొత్త పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం