Minister Ponguleti : 'తుస్సు బాంబ్ కాదు... వారికి ఆటమ్ బాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి కామెంట్స్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు.. తప్పు చేసిన వాళ్లకు ఆటమ్ బాంబు పేలబోతోందని చెప్పారు. వర్ధన్నపేటలో మాట్లాడిన ఆయన.. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
పొలిటికల్ బాంబులు పేలనున్నాయ్ అంటూ కొరియా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీపావళికి ముందే పేలుతాయ్ అంటూ హింట్ కూడా ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో స్పందన వచ్చింది. దీపావళి వెళ్లిపోయింది… బాంబులు మాత్రం పేలలేదంటూ పొంగులేటిని టార్గెట్ చేస్తూ వచ్చారు.
వాళ్లకు ఆటమ్ బాంబు పేలబోతుంది - పొంగులేటి
ఇదిలా ఉంటే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్ధన్నపేటలో మాట్లాడిన ఆయన…నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు.. తప్పు చేసిన వాళ్లకు ఆటమ్ బాంబు పేలబోతోందని చెప్పారు. “తుస్సు బాంబు అంటూ మాట్లాడం చూశా. కానీ త్వరలోనే తప్పు చేసిన వారికి ఆటమ్ బాంబ్ లాగా పేలబోతుంది. తప్పు చేయని వారికి ఏమీ కాదు” అంటూ మాట్లాడారు.
జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదని వ్యాఖ్యానించారు. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇక వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా… పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన పొంగులేటి… కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చేందుకు కేటీఆర్ కు జ్ఞానోదయం కలిగినందుకు సంతోషిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు. అధికారంలో ఉన్న నాడు అధికార మదంతో సామాన్య ప్రజలను కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు పాదయాత్ర చేసినా… మోకాళ్ళ యాత్ర చేసినా తాము స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజుల తర్వాత అయినా ప్రజలు, కార్యకర్తలు గుర్తు రావడం సంతోషమన్నారు.
రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని మంత్రి పొంగులేటి చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల నిధులతో నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, కాంట్రాక్టర్లకు సూచించారు. రోడ్డు వెడల్పు వర్క్ ఆర్డర్ ప్రకారం చేపట్టాలని… పనుల నాణ్యతలో రాజి పడేదే లేదని తెలిపారు,ఎన్నికలలో వచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఒకొకటిగా నెరవేరిస్తుందన్నారు. రానున్న రోజులలో ఐదు లక్షలతో రెండు పడకల ఇండ్లు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం