TG Indiramma Housing Scheme : 'ఇందిరమ్మ' ఇంటి కోసం దరఖాస్తు చేసుకోలేదా..! అయితే ఇలా చేయండి
ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. శుక్రవారం కూసుమంచిలో మాట్లాడిన ఆయన.. - రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కూసుమంచిలో మాట్లాడిన ఆయన… పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారని గుర్తు చేశారు.
మోడల్ హౌజ్ ల నిర్మాణం….
రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని తెలిపారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామన్న ఆయన… రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. సంక్రాంతి నాటికి కూసుమంచి లో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం లో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారని వివరించారు. ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఇందిరమ్మ ప్రభుత్వం లో కండీషన్ లు పెట్టి ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదని మంత్రి స్పష్టం చేశారు. పేదవారికి భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గ్రామాలకు సర్వేకు వచ్చే అధికారులు ఇందిరమ్మ కమిటీలను కలుపుకుని పోవాలని పిలుపునిచ్చారు. పేదవారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
కొనసాగుతున్న సర్వే…!
ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేసి… లబ్ధిదారులను గుర్తిస్తారు. యాప్ అందుబాటులోకి రావటంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ వేగవంతం కానుంది.
ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఆయా దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి సర్వేయర్లు యాప్ లో వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలైంది.
ఇంటికి వచ్చే సర్వేయర్లు… దరఖాస్తుదారుడి అన్ని వివరాలను సేకరిస్తారు. గతంలో ఏదైనా ఇంటి స్కీమ్ లో లబ్ధి పొందారా..? ఎలాంటి వాహనాలు ఉన్నాయి..? స్థలం ఎవరి పేరుపై ఉంది..? కుటుంబంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా..? ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుతో పాటు ఇతర వివరాలను తీసుకుంటారు. దరఖాస్తుదారుడు ఇచ్చే సమాచాన్ని యాప్ లో నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో క్రోడీకరిస్తారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కీలకంగా పని చేయనుంది. అన్నింటిని పరిశీలించిన తర్వాతే… అసలైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తారు.
తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారు.
సంబంధిత కథనం