TG Indiramma Housing Scheme : ఇందిర‌మ్మ ఇండ్లపై కీలక అప్‌డేట్.. గ్రౌండింగ్ వేగ‌వంతం.. త‌క్ష‌ణ‌మే చెల్లింపులు!-minister ponguleti srinivas reddy key comments on the grounding of indiramma houses and payment of bills ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Indiramma Housing Scheme : ఇందిర‌మ్మ ఇండ్లపై కీలక అప్‌డేట్.. గ్రౌండింగ్ వేగ‌వంతం.. త‌క్ష‌ణ‌మే చెల్లింపులు!

TG Indiramma Housing Scheme : ఇందిర‌మ్మ ఇండ్లపై కీలక అప్‌డేట్.. గ్రౌండింగ్ వేగ‌వంతం.. త‌క్ష‌ణ‌మే చెల్లింపులు!

TG Indiramma Housing Scheme : ఇందిర‌మ్మ ఇండ్ల గ్రౌండింగ్ వేగ‌వంతం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణ‌మే చెల్లించాలని స్పష్టం చేశారు. వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన పొంగులేటి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇందిరమ్మ ఇల్లు (నమూనా చిత్రం)

పైల‌ట్ గ్రామాల‌లో ఇందిర‌మ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో శుక్ర‌వారం వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నులు, సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, తాగునీరు, ఇందిర‌మ్మ ఇండ్లు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఇదే ప్రాధాన్యత అంశం..

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 'ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్య‌తా అంశ‌ం. దీనిని దృష్టిలో పెట్టుకొని క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలి. ఇందిరమ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం నాలుగు విడ‌త‌ల‌లో చెల్లింపులు చేస్తుంది. మొద‌టి విడ‌త‌లో బేస్ మెంట్ లెవెల్ పూర్త‌యిన ఇండ్ల‌కు ల‌క్ష రూపాయిలు ఇస్తుంది. ఇండ్ల వివ‌రాల‌ను హౌసింగ్ విభాగానికి పంపిస్తే త‌క్ష‌ణ‌మే చెల్లింపులు చేస్తాం. ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు కేటాయించ‌ని 2 బీహెచ్‌కే ఇండ్ల‌ను కేటాయించాలి. మొండి గోడ‌ల‌తో ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ ముందుకు రాని ప‌క్షంలో ల‌బ్దిదారులే ఆ ఇండ్ల‌ను పూర్తిచేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి.. ఇండ్ల‌ను కేటాయించాలి' అని సూచించారు.

తాగునీటి సమస్య రావొద్దు..

'వేస‌వి కాలంలో ఏ గ్రామంలో, ప‌ట్ట‌ణంలో తాగునీటి స‌మ‌స్య రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. ప్ర‌ధానంగా జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ అంశానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి. జిల్లా అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని వారంలో మూడు రోజులు గ్రామాల్లో ప‌ర్య‌టించాలి. వ‌చ్చే మూడు నెల‌లు చాలా కీల‌క‌మ‌ని.. తాగునీటి గురించి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప‌నిచేయాలి. నీటికొర‌త ఉన్న ప్రాంతాల‌లో ట్యాంక‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేయ‌డం, చెడిపోయిన బోర్లు, హ్యాండ్ పంప్‌ల‌ను త‌క్ష‌ణం మ‌ర‌మ్మ‌తులు చేయించాలి' అని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

రెండు నెలల్లో పూర్తి చేయాలి..

'వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను రెండు నెల‌ల్లో పూర్తిచేయాలి. ఆ త‌ర్వాత మ‌రో నెల‌రోజుల్లో వైద్య సేవ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌రికరాల‌ను అమ‌ర్చాలి. జూన్ చివ‌రినాటికి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ ఆసుప‌త్రి అందుబాటులోకి వ‌స్తే ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయి' అని మంత్రి వ్యాఖ్యానించారు.

తాత్కాలిక పరిష్కారం..

'మ‌డికొండ డంపింగ్ యార్డు స‌మ‌స్య‌కు వారం రోజుల్లో తాత్కాలిక ప‌రిష్కారం చూపించి.. ఆ తర్వాత శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలి. దీనికి సంబంధించి సీడీఎంఏ డైరెక్ట‌ర్ శ్రీ‌దేవిని స్వ‌యంగా అక్క‌డ ప‌ర్య‌టించి ప‌రిష్కార మార్గాల‌ను సూచించాలి. వ‌రంగ‌ల్- క‌రీంన‌గ‌ర్ ర‌హ‌దారి ప్రాంతంలో శాశ్వ‌త డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎక‌రాల భూమిని సేక‌రించాలి' అని క‌లెక్ట‌ర్ల‌ను పొంగులేటి ఆదేశించారు.

వర్షాకాలం లోపు పూర్తి చేయాలి..

'వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి చెరువు పూడిక‌తీత ప‌నుల‌ను ఎట్టిప‌రిస్దితుల‌లోను వ‌ర్షాకాలం ప్రారంభ‌మ‌య్యేలోపు పూర్తిచేయాలి. వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నుల విష‌యంలో అధికారులు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాలి' అని మంత్రి స్పష్టం చేశారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు క‌డియం శ్రీహ‌రి, నాయ‌ని రాజేందర్‌ రెడ్డి, య‌శ‌స్విని రెడ్డి, దొంతి మాధ‌వ‌రెడ్డి, నాగ‌రాజు, ముర‌ళీనాయ‌క్‌, రామ‌చంద్ర నాయ‌క్‌, రేవూరి ప్ర‌కాష్‌రెడ్డి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌ పాల్గొన్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.