ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించిన ఆయన… అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేయడానికి వెనుకాడ వద్దని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇల్లు అర్హులకే అందాలన్నారు.
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి సూచించారు. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ ఇటుకల కోసం మండల స్ధాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వీలైనంత త్వరితగతిన ఈ కమిటీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాకూడా దాని ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాల కలెక్టర్లు చేయాల్సింది లబ్దిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ అని చెప్పారు. ఈ మూడు అంశాలను పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్ధాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పధకానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతి చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే దాన్ని అమలు చేయడం మరో ఎత్తు అని వ్యాఖ్యానించారు. ఈ చట్టం ఫలితాలు ప్రతి పేదవానికి అందినప్పుడే చట్టం సార్ధకత నెరవేరుతుందన్నారు. ఈ చట్టాన్ని క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన గురుతరమైన బాధ్యత జిల్లాల కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే సామాన్యుడు సైతం సంతోషపడేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.