'మేడారం' మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం - త్వరలోనే ప‌నులు ప్రారంభం...!-minister ponguleti announced that the master plan for the medaram fair is ready ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'మేడారం' మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం - త్వరలోనే ప‌నులు ప్రారంభం...!

'మేడారం' మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం - త్వరలోనే ప‌నులు ప్రారంభం...!

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్దమైంది. ముఖ్యమంత్రి ఆమోదం త‌ర్వాత ప‌నులు ప్రారంభం కానున్నాయి. వంద‌రోజుల్లోపు ఆధునీక‌ర‌ణ పనులు పూర్తవుతాయని మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు.

మేడారం జాతర(ఫైల్ ఫొటో)

తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై మంత్రులు కీలక ప్రకటన చేశారు. ఆదివాసీ గిరిజ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునీక‌ర‌ణ‌, భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు వంటి ప్రాధాన్య‌తా అంశాల‌తో కూడిన మాస్ట‌ర్ ప్లాన్‌కు తుదిరూపు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

వంద రోజుల్లో పనులు పూర్తి….

ఈ మాస్ట‌ర్ ప్లాన్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి…. ఆమోదం ల‌భించిన వెంట‌నే ఆధునీక‌ర‌ణ ప‌నులు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. వంద‌ రోజుల్లోగా ప‌నులు పూర్తి చేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ల‌క్షలాది మంది భ‌క్తుల‌కు మెరుగైన ద‌ర్శ‌నం, ఇత‌ర సౌక‌ర్యాలు ల‌భించే విధంగా అంగుళం తేడా లేకుండా శాస్త్రోప‌క‌రంగా సమ్మక్క సార‌ల‌మ్మ పూజారుల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప్ర‌తి అంశంలోనూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించామ‌న్నారు.

గురువారం డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో మంత్రులు సీత‌క్క‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌తో క‌లిసి మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ మాస్ట‌ర్ ప్లాన్‌పై స‌మీక్షించారు. గ‌ద్దెల‌ను అభివృద్ది డిజైన్ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ప్ర‌ధాన ద్వారం డిజైన్, ప్ర‌హారీగోడ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన రాతి డిజైన్ గ‌ద్దెల అభివృద్ది త‌ర్వాత అద‌నంగా ఎంత విస్తీర్ణం పెరుగుతుంది వంటి అంశాల‌పై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు. అభివృద్ది ప‌నుల‌కు సంబంధించిన యాక్ష‌న్ ప్లాన్‌ను రెండు రోజుల్లో స‌మ‌ర్పించాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ త‌యారుచేసిన క‌న్స‌ల్టెన్సీని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. అధికారులు, క‌న్స‌ల్టెన్సీ ప్ర‌తినిధులు స్వ‌యంగా మేడారం వెళ్లి అక్క‌డి పూజారులు, స్ధానిక ప్ర‌జ‌ల అంద‌రి అభిప్రాయాల‌ను తీసుకొని గ‌ద్దెల డిజైన్ త‌యారు చేయ‌డం జ‌రిగిందన్నారు. గ‌తంలో భ‌క్తుల‌కు క్యూలైన్ల వ‌ల‌న ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల ద‌ర్శ‌నం స‌రిగా ల‌భించేదికాదని గుర్తు చేశారు. మ‌హాజాత‌ర స‌మయంలో ఇది భ‌క్తుల‌కు ఇబ్బందిక‌రంగా ఉండేదన్నారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు భ‌క్తుల సౌక‌ర్యార్ధం గ‌ద్దెల ప్రాంగ‌ణాన్ని విస్త‌రిస్తున్నామ‌ని తెలిపారు.

తెలంగాణ‌లో జ‌రిగే స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ జాత‌ర ప్ర‌పంచంలోనే అతి పెద్ద గిరిజ‌న పండుగ‌గా ప్ర‌సిద్ధి గాంచిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇది గిరిజ‌న సంప్ర‌దాయ రీతికి ద‌ర్ప‌ణం ప‌డుతుంద‌ని త‌మ క‌ష్టాల‌ను క‌డ‌తేర్చే క‌లియుగ దైవాలుగా, వ‌న‌దేవ‌త‌లుగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తార‌ని తెలిపారు. సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని వివరించారు. మేడారం ఆలయం తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలను శోభాయ‌మానంగా తీర్చిదిద్దుతామ‌ని వెల్లడించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం