TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల జాబితాలు, ఎంపిక విధానం ఇలా…!
TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 74 శాతం సర్వే పూర్తయిందని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అయితే లబ్ధిదారుల ప్రకటన సంక్రాంతి తర్వాత ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఈ సంక్రాంతిలోపే పూర్తిస్థాయిలో సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 74 శాతం పూర్తయింది. ఇందుకు సంబంధించిన వివరాలను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
గురువారం గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి… సర్వే వివరాలపై ఆరా తీశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన… సంక్రాంతి పండుగ తరువాత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ప్రకటించారు. ప్రజాపాలనలో ఇందిర్మ ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు రాగా… వాటిలో ఇప్పటివరకు 59,89,889 దరఖాస్తులపై సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 94 శాతం సర్వే పూర్తయినట్లు వివరించారు.
లబ్ధిదారుల ఎంపికపై కీలక ప్రకటన …!
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి పొంగులేటి కీలక వివరాలను వెల్లడించారు. సంక్రాంతి తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తారని చెప్పారు.
ఇక ఈ సంక్రాంతిలోపే అన్ని జిల్లాలోనూ సర్వే దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే జాబితాల రూపకల్పనలో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా పని చేయనున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాలు, వార్డుల్లో ఈ కమిటీలు కొలువుదీరాయి.
గ్రామసభ ద్వారా రూపొందించిన లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు చేరుతుంది. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు… దశల వారీగా జమవుతాయి.
మరోవైపు తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పింది. ఈ క్రమంలో.. ఈ విడతలో ఖాళీ జాగా ఉన్న వారికే అత్యధికంగా స్కీమ్ కు అర్హత సాధించే అవకాశం కనిపిస్తోంది.
ఇందిర్మ ఇళ్ల స్కీమ్ విషయంలో పట్టణ ప్రాంతాల్లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ స్కీమ్ కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే శివారు ప్రాంతాల్లో కొంత మందికి స్థలాలు ఉన్నప్పటికీ… సెంట్రల్ సిటీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జాగలు ఉన్న వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ సర్వే పూర్తి అయితే… మరికొన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. జిల్లాల్లో దాదాపు సర్వే ప్రక్రియ పూర్తి కాగా… గ్రేటర్ లో మాత్రం… అతి తక్కువ శాతం సర్వే పూర్తయింది.
ఇక లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. లక్షలాది దరఖాస్తులు రావటంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాల్ గా మారింది.
సంబంధిత కథనం