మున్నేరు బాధితులందరికీ స్థలాలు – మంత్రి కీలక ప్రకటన-minister ponguleti announced that places will be allotted in the river front colony for munneru vagu victims ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మున్నేరు బాధితులందరికీ స్థలాలు – మంత్రి కీలక ప్రకటన

మున్నేరు బాధితులందరికీ స్థలాలు – మంత్రి కీలక ప్రకటన

మున్నేరు వాగు బాధితుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బాధితులందరికి రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు.

మునేరు రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి

మున్నేరు బాధితులందరికి రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గతేడాది అకాల వర్షాలతో ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలు తీవ్రంగా బాధపడ్డ విషయాన్ని గుర్తు చేశారు.

17 కి.మీ మేర రిటైనింగ్ వాల్‌ - మంత్రి పొంగులేటి

వరదల సమయంలో మున్నేరు బాధితులను పరామర్శించి తక్షణ సహాయం అందించామని మంత్రి చెప్పారు. అదే స్పూర్తితో ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని వివరించారు. ఈ ప్రాంతాల్లో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న పేదల భద్రత కోసమే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు.

“రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వారికీ భరోసా కలుగుతుంది. ఎవరికీ అన్యాయం కాకుండా, అందరికీ రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కల్పిస్తాం. దాదాపు 450 నుంచి 500 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. రిటైనింగ్ వాల్ నిర్వాసితులకు అందులో ప్రాధాన్యతగా స్థలాలు ఇచ్చేలా చూస్తాం. గత ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం జీవో వరకే పరిమితం చేసింది. కానీ మా ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వైపులా 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్‌ను నిర్మిస్తున్నాం. ఈ వాల్‌తో పాటు రెండు వైపులా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాం, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేస్తున్నాం”అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రైతులు సహకరించాలి…

మున్నేరు పరివాహక ప్రాంతాల్లో భూములు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పొంగులేటి కోరారు. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమని…. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. పేదలకు న్యాయం చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు క్రెడిట్ రాకూడదని విపక్షాలు కుట్రలకు పాల్పడుతున్నాయని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెర వెనుక నుంచి కొంతమంది రైతులను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు కుట్రలు చేస్తున్నారన్న సమాచారాన్ని అధికారులు సేకరించారని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజల అభివృద్ధిని నిజంగా కోరుకునే వారైతే ఇకనైనా స్పష్టతతో ఆలోచించాలని… సక్రమంగా మసలుకోవాలని హితవు పలికారు.

“సీతారామ ప్రాజెక్ట్ తాము పూర్తిచేశామంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగా 90 శాతం పూర్తయుంటే, ఇంకా 40 శాతం పనులు మిగిలి ఎలా ఉంటాయి? కనీసం డ్రైరన్ కూడా చేయకుండా మోటార్లు బిగించామంటూ చెప్పడం విడ్డూరం. తాము తప్ప ఇంకెవ్వరూ ఏమీ చేయలేరన్న ధోరణిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. విమర్శలు చేయాలి తప్పు కాదు..కానీ చేసే విమర్శ సోయీతో ఉండాలి. సత్యంగా ఉండాలి” అంటూ మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం