Eating Rice in Telangana : వరి అన్నం వివాదం.. చంద్రబాబు వ్యాఖ్యలకి నిరంజన్ రెడ్డి కౌంటర్-minister niranjan reddy slams tdp chief chandrababu over telangana rice diet statements ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Niranjan Reddy Slams Tdp Chief Chandrababu Over Telangana Rice Diet Statements

Eating Rice in Telangana : వరి అన్నం వివాదం.. చంద్రబాబు వ్యాఖ్యలకి నిరంజన్ రెడ్డి కౌంటర్

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 01:00 PM IST

Eating Rice in Telangana : టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు వరి బియ్యం ఆహారంగా తీసుకోడం ప్రారంభించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. దుమారం రెపుతున్నాయి. టీడీపీ అధినేత వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు చరిత్ర తెలుసుని మాట్లాడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Eating Rice in Telangana : చంద్రబాబు వ్యాఖ్యలు.. తెలంగాణ నేతలకు మరోసారి ఆగ్రహం తెప్పించాయి. టీడీపీ అధినేత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ టీ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో టీడీపీని మళ్లీ పొలిటికల్ ట్రాక్ లోకి తేవడంపై దృష్టి సారించిన చంద్రబాబు... ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు... ఎన్టీఆర్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు ఆహారంగా తీసుకునే వారని... ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కే కిలో బియ్యం పథకంతో తెలంగాణ ప్రజలు వరి బియ్యం ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. దేశంలో ఆహార భద్రతకు ఆ పథకమే పునాదులు వేసిందని చెప్పుకొచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు టీడీపీ అధినేత గతంలోనూ చేశారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

వరి అన్నం అంశంలో... చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. 15వ శతాబ్దం నుంచే హైదరాబాద్ దమ్ బిర్యానికి ప్రసిద్ధి చెందిందని చెప్పారు. తెలుగుదేశం పాలనలో రూ. 2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటయింది అని చంద్రబాబు చెప్పడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మూర్ఖపు అహంకారానికీ పరాకాష్ట అని చెప్పారు.

‘‘జొన్నకలి, జొన్నయంబలి

జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్

సన్నన్నము సున్న సుమీ

పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’

అని మహాకవి శ్రీనాథుడు (1365 - 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారన్నారు నిరంజన్ రెడ్డి. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ.... వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచిందని తెలిపారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని... అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల దాక గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయభివృద్దికి బాటలు వేశారని వివరించారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారన్నారు. అక్కసు, ఆక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది అని పేర్కొన్నారు.

1956లో ఆంధ్రలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం అని నిరంజన్ రెడ్డి విమర్శించారు. చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని... అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారని .. ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారన్నారు. గ్రామాల్లో ఉపాధి కరవై బొంబాయి, దుబాయి బాట పట్టేలా చేశారని దుయ్యబట్టారు. ఆఖరుకు రూ. 2 కు కిలో బియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL_Entry_Point