పోలవరం కట్టేది కేసీఆరే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు-minister malla reddy statement on polavaram visakha steel plant ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Malla Reddy Statement On Polavaram Visakha Steel Plant

పోలవరం కట్టేది కేసీఆరే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
May 01, 2023 02:05 PM IST

పోలవరం పూర్తి చేసేది కేసీఆరేనని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నిర్మాణం పూర్తిచేసేది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. అందరూ తెలంగాణ వైపే చూస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్ అవుట్ అయిపోయిందని అన్నారు. మహారాష్ట్రలో లక్షలాది మంది బీఆర్ఎస్‌కు బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ‘ఆంధ్రలో కుల రాజకీయాలు చేస్తున్నారు. రెడ్డి, కాపు, కమ్మ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలను పట్టించుకునే వారు లేరు. పోలవరం కట్టేది కేసీఆరే. విశాఖ ఉక్కును కాపాడుకునేది కేసీఆరే..’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారని, కేసీఆర్ అందిస్తున్న పాలన అంతటా రావాలని చూస్తున్నారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణలో కాళేశ్వరం, ఆంధ్ర ప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. దానికి నిధులు కేంద్రమే ఇస్తోంది. అయినా పూర్తికాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వకున్నా తెలంగాణే నిధులు సమకూర్చుకుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రాజెక్టును కేసీఆర్ పూర్తిచేశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది కేసీఆరే. విశాఖ ఉక్కును కాపాడేది కేసీఆరే.. ’ అని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్, కేటీఆర్ 9 ఏళ్లలో తెలంగాణను మరో ప్రపంచంగా మార్చారని, ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడే చదువుకుంటున్నారని, ఉపాధి పొందుతున్నారని అన్నారు. అంతలా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. తెలంగాణకు 17 వైద్య కళాశాలలు తెచ్చారని అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు లభిస్తోందని, మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పోలవరం నిర్మాణం పూర్తవుతుందని, విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చని అన్నారు.

IPL_Entry_Point