KTR On Modi: మోదీ అద్భుతమైన మహానటుడు... ఆస్కార్ ఇవ్వాలి-minister ktr satires on pm narendra modi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Ktr Satires On Pm Narendra Modi

KTR On Modi: మోదీ అద్భుతమైన మహానటుడు... ఆస్కార్ ఇవ్వాలి

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 06:20 PM IST

BRS Public Meeting at Pitlam: ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు. ప్రధాని మహానటుడు అని... ఆయనకు ఆస్కార్ వచ్చేది అంటూ కామెంట్స్ చేశారు. జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం పిట్లంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మోదీపై కేటీఆర్ సెటైర్లు
మోదీపై కేటీఆర్ సెటైర్లు (twitter)

Minister KTR Fires On BJP and Congress: జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో అమ‌ల‌వుతున్నాయా..? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో రైతుబంధు, రైతుబీమా, క‌ల్యాణ‌ల‌క్ష్మి, మిష‌న్ భ‌గీర‌థ వంటి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయా..? అనే విష‌యాన్ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని కేటీఆర్ కోరారు. ఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధి క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రలో క‌నిపిస్తుందా..? అని అన్నారు. బీఆర్ఎస్ ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టే మంజీరా (నాగమడుగు) ఎత్తిపోతల పథకం పనులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్... "ఇవాళ చాలా సంతోషంగా ఉంది. జుక్క‌ల్ ఎమ్మెల్యే హ‌న్మంత్ షిండే ఓ చిరున‌వ్వుతో ఉండే నేత‌. నేను ఒక‌నాడు సాగునీటి శాఖ‌లో ఇంజినీర్‌గా ప‌ని చేశాను. ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌ని చేసిన స‌మ‌యంలో రైతుల క‌ష్టాలు చూస్తే క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చేదని షిండే నాకు చెప్పారు. కానీ ఇవాళ ఈ ప్రాంతంలో నాగ‌మ‌డుగు లిఫ్ట్ ఇరిగేష‌న్‌ కు శంకుస్థాప‌న చేయ‌డం ద్వారా షిండే క‌ళ్ల‌ల్లో ఆనందం చూశాను. ఈ ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎక‌రాల‌కు నీళ్లు రాబోతున్నాయి. రైతుల ద‌శాబ్దాల క‌ల నెర‌వేర‌బోతుంది" అని కేటీఆర్ తెలిపారు.

మళ్లీ జీవం పోసుకున్నాం…

నీళ్ల పోరాటం ఫ‌లించిందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఎండిన నిజాం సాగర్ మ‌ళ్లీ జీవం పోసుకుందని చెప్పారు. "రెండు పంట‌ల‌కు నీళ్లు ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. దీంతో ఈ ప్రాంత రైత‌న్న‌ల చిర‌కాల వాంఛ నెర‌వేర‌బోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు క‌రెంట్ కోసం గోస ప‌డేవాళ్లం. ఇప్పుడు క‌రెంట్ పోతే వార్త అవుతుంది. ఎన్నో మార్పులు వ‌చ్చాయి. తాగునీటి కోసం ఒకప్పుడు బిందెలు ప‌ట్టుకుని ఆడ‌బిడ్డ‌లు ధ‌ర్నాలు చేసేవారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక‌.. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా సుర‌క్షిత‌మైన తాగునీరు అందిస్తున్నాం" అని కేటీఆర్ అన్నారు. బిచ్కుంద‌, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తామన్న ఆయన... మిగ‌తా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ఈ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించే షిండే మాట్లాడుతార‌ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. "జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అదృష్ట‌వంతులు. మంచి నాయ‌కుడు దొరికిన‌ప్పుడు గ‌ట్టిగా 10 కాలాల పాటు కాపాడుకోవాలి. గ‌త ఎన్నిక‌ల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పిండు.. ఈ సారి నాగ‌మ‌డుగు ప్రాజెక్టు తెచ్చినందుకు 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్య‌త మీపై ఉన్న‌ది. ప్ర‌జ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధితో ప‌ని చేసేవారు కొంద‌రే ఉంటారు. అందులో ఒక‌రు హ‌న్మంత్ షిండే. అలాంటి నాయ‌కుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఆస్కార్ వచ్చేది...

తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని బీజేపీ అని మండిపడ్డారు కేటీఆర్. "మోదీకి, ఈడీకి, బోడికి భ‌య‌ప‌డేది లేదు.. భ‌య‌ప‌డేది దొంగ‌లు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌జా కోర్టులో తేల్చుకుందాం. ఎవ‌రు నీతిమంతులో, ఎవ‌రు అవినీతిప‌రులో.. ఎవ‌రేం త‌ప్పు చేశారో, ఒప్పు చేశారో.. 2023లో ప్ర‌జ‌లే తీర్పు ఇస్తారు. ఎన్నిక‌లు రాగానే బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు వ‌స్తారు. వారికి కర్రుకాల్చి వాత పెట్టాలి. కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా ఎన్నుకోవాలి. కేసీఆర్‌ను కాపాడుకొని ఈ దేశానికి స్ప‌ష్ట‌మైన సందేశం ఇవ్వాలి. రెండు రోజుల క్రితం తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చింది. ఈ దేశంలో అద్భుత‌మైన మ‌హాన‌టుడు ఉన్నాడు. అత‌న్ని పంపితే ఆస్కార్ త‌ప్ప‌కుండా వ‌చ్చేది. 2014లో ఎన్నో మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిండు. దేశం మొత్తం సంప‌ద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడు. వారి ద‌గ్గ‌ర చందా తీసుకోని ప్ర‌తిప‌క్ష పార్టీల మీద ప‌డుతున్నాడు. పార్టీల‌ను చీల్చి, ఎమ్మెల్యేల‌ను కొని, దేశాన్ని ఆగం చేయాల‌ని చూస్తున్నాడు. ఆయ‌న‌ను మ‌హాన‌టుడు అని ఉట్టిగానే అన‌లేదు. ఇలా నాట‌కాలు ఆడుతున్నందుకే మ‌హాన‌టుడు అని అన్నాను. రైతుల ఆదాయం డ‌బుల్ చేస్తాను అన్నాడు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. సంవ‌త్స‌రానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదు. న‌ల్ల‌ధ‌నం తెస్తాన‌ని చెప్పిండు. దాన్ని గురించి అడిగితే తెల్ల ముఖమేస్తున్నాడు" అంటూ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు కేటీఆర్.

55 ఏండ్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేద‌ని మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. "పాద‌యాత్ర‌లు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. 10 ఛాన్స్‌లు ఇచ్చారు. 50 ఏండ్లు అవ‌కాశం ఇచ్చిన్ప‌పుడు క‌రెంట్, నీళ్లు, విద్య ఇవ్వ‌నోడు.. ఇవాళ వ‌చ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇలా అడ‌గ‌డంతో వాళ్లు పిచ్చొళ్లా…? మ‌నం పిచ్చొళ్లామా..? ఆలోచించాలి. నిన్న మొన్న‌టి దాకా మ‌నల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. ఒక్క లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు క‌ట్ట‌లేదు. పెన్ష‌న్లు ఇవ్వ‌డం చేత‌కాలేదు. అస‌లు కాంగ్రెస్‌కు ఎందుకు ఇవ్వాలి ఛాన్స్‌లు. కాంగ్రెసోళ్ల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు. అద్భుత‌మైన ఎమ్మెల్యే హ‌న్మంత్ షిండేను 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. అవ‌కాశం, అధికారం ఉన్న‌ప్పుడు ఏం చేయ‌లేనోడు.. ఇవాళ వ‌చ్చి డైలాగులు కొడితే ప‌డిపోదామా..? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల మోస‌పూరిత మాట‌ల‌కు మోసపోవ‌ద్దు" అని ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం