KTR : తెలంగాణలో మళ్లీ అధికారం మాదే... మంత్రి కేటీఆర్
KTR : రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన సీఐఐ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ఆయన... వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు.
KTR : భారత పరిశ్రమల సమాఖ్య - సీఐఐ తెలంగాణ వార్షికోత్సవ సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట్ ఐటీసీ కాకతీయలో జరిగిన CII సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్... పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాపారవేత్తల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని స్పష్టం అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని సీఐఐ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్న ఆయన... ప్రపంచంలోని మేటి సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా నిలుస్తోందని అన్నారు.
పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. తమలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తే దేశం అద్భుతంగా పురోగతి సాధిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని... 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. ఈ రంగం విలువని 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేరుస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని... ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 35 శాతం హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని... దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టంట్ తయారీ కేంద్రం హైదరాబాద్ డివైజెస్ పార్కులోనే ఉందని పేర్కొన్నారు. ఫార్మా పరిశ్రమలు అన్నింటికీ ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొదటగా హైదరాబాద్ లోనే జరిగిందని కేటీఆర్ తెలపారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని... ముందుచూపుతో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్ లను ఏర్పాటు చేశాయని వివరించారు. ఐటీ రంగం ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేస్తున్నామని... సాఫ్ట్ ఇండస్ట్రీకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ అవతరించిందని చెప్పుకొచ్చారు. విభిన్న కంపెనీలు మాత్రమే కాదు.. విభిన్నమైన ఆచారాలు, ఆహారం కూడా హైదరాబాద్‌లో కనిపిస్తాయన్నారు. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు.
విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉన్నాయని భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ దక్షిణప్రాంత ఛైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. పెట్టుబడిదారులకి తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం ఇస్తోందని అన్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని... అందువల్లే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అనంతరం.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 28 మంది పారిశ్రామిక వేత్తలకు మంత్రి కేటీఆర్ పురస్కారాలను అందజేశారు.