KTR Fires On BJP: పేపర్ లీక్‌ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే - మంత్రి కేటీఆర్-minister ktr fires on bandi sanjay and bjp leaders over tspsc paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Ktr Fires On Bandi Sanjay And Bjp Leaders Over Tspsc Paper Leak Case

KTR Fires On BJP: పేపర్ లీక్‌ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే - మంత్రి కేటీఆర్

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 08:04 PM IST

Minister KTR Fires On BJP: టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ తెలివి లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాల పనితీరు వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్‌ కుట్ర ముమ్మాటికీ బీజేపీదేనని కేటీఆర్ ఆరోపించారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (twitter)

Minister KTR On TSPSC Paper Leak Issue: బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైంది అంటూ కామెంట్స్ చేశారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందన్నారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా.. బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

ట్రెండింగ్ వార్తలు

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలియకండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం.. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టీఎస్పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అబాసు పాలై, పరువునష్టం కేసు ఎదుర్కొంటున్నారన్నారని గుర్తు చేశారు. అయినా బండి సంజయ్ కు బుద్ది రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వాటిపై ఏమంటావ్…?

బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇందులో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందనన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై ఏం చెబుతారని బండి సంజయ్ ని సూటిగా నిలదీశారు. పేపర్ లీకేజీల పైన ప్రధానమంత్రి మోదీని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే.. తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ.. లేక అక్కడి ముఖ్యమంత్రిని కానీ.. ఏనాడు బీజేపీ బాధ్యులను చేయలేదన్నారు. స్వయంగా బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలా.. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమని చెప్పారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్ ను నియమించి.. బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందన్నారు మంత్రి కేటీఆర్. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.

ముమ్మాటికీ బీజేపీ కుట్రే…

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వారిని పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తి యువత గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్ ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అన్నారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కేటిఆర్ ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మరొకసారి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం