KTR on PM Modi: మోదీ తెలంగాణ విరోధి అంటూ మండిపడిన కేటీఆర్..-minister ktr expressed his anger on pm modi comments in emergence of telangana state ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Minister Ktr Expressed His Anger On Pm Modi Comments In Emergence Of Telangana State

KTR on PM Modi: మోదీ తెలంగాణ విరోధి అంటూ మండిపడిన కేటీఆర్..

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 06:45 AM IST

KTR on PM Modi: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర‌్భంగా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తీరును తప్పు పట్టడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణ విరోధి అంటూ ట్వీట్ చేవారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

KTR on PM Modi: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణ విరోధి అంటూ మండిపడ్డారు. ప్రధాని కామెంట్స్‌ తమకు దిగ్భ్రాంతి కలిగించాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించడం ఇదేం తొలిసారి కాదని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాన్ని ప్రస్తావించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

మోదీ.. తెలంగాణ విరోధి! అంటూ ప్రారంభించిన కేటీఆర్‌

''మోదీ.. తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం ఏం సంస్కారం అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా అని నిలదీశారు.

తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారన్నారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని, మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారన్నారు.

ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా?

వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని తెలంగాణ రైతుల్ని కేంద్రమంత్రి కించపరిచారని, ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా..! మీలాగే మీ మంత్రులు! అన్నారు. మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరని కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించాలన్నారు. ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మోదీ చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోమన్నారు. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతిలేకుండా మిషన్ కాకతీయ, భగీరథలకు నిధులను నిరాకరించిన మీ నిర్వాకాన్ని ఏమనాలన్నారు? కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగాదక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలన్నారు.

మేం చేసిన పాపమేంది..?

కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి తెలంగాణకు ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. తెలంగాణపై ఎంత కోపమో కదా అన్నారు. పైన అప్పర్ భద్ర, కింద పోలవరం, ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకన్నారు.

తెలంగాణ చేసిన పాపమేందని బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారు ఎందుకన్నారు. సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తారు. ఐటీఐఆర్‌ను రద్దు చేశారు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారని మండిపడ్డారు.

అడుగడుగునా దగా.. ప్రశ్నిస్తే పగ… జుమ్లా.. హమ్లా డబుల్ ఇంజన్‌ సర్కారు మీదని ఆరోపించారు. ఈడీ,ఐటీ, సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మోదీ.. పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రమన్నారు. డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే మీకు.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా..!'' అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

WhatsApp channel