మంత్రుల మధ్య టెండర్ల వార్...? పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు...!-minister konda surekha complaint against minister ponguleti to cm and party high command ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మంత్రుల మధ్య టెండర్ల వార్...? పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు...!

మంత్రుల మధ్య టెండర్ల వార్...? పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు...!

తెలంగాణ కేబినెట్ లోని మరో ఇద్దరు మంత్రుల మధ్య సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ… కేబినెట్ లోని మరో మంత్రిగా ఉన్న పొంగులేటిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మేడారం టెండర్ల విషయం ఇందుకు కారణమైనట్లు సమాచారం.

మంత్రుల మధ్య విభేదాలు...!

తెలంగాణ కాంగ్రెస్ లో మరో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరు నేతలు కూడా కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. ఈ వివాదానికి కారణం టెండర్ల వ్యవహారమని తెలుస్తోంది. తన శాఖలో సదరు మంత్రి జోక్యమేంటని ప్రశ్నిస్తూ… సీఎంతో పాటు పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో గంత కొద్దిరోజులుగా కేబినెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు… రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ మారాయి.

ఇటీవలనే మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి పొన్నం వెనక్కి తగ్గి…. క్షమాపణలు కూడా చెప్పటంతో విషయం సద్దుమణిగింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటిపై మరో మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

అసలేమైంది..?

మేడారం ఆలయ టెండర్ల విషయం వీరి మధ్య విబేధాలకు ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే జిల్లా నుంచి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. ప్రస్తుతం ఆమె దేవాదాయశాఖ బాధ్యతలను చూస్తున్నారు. అయితే దేవాదాయశాఖకు చెందిన ఓ టెండర్ ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది. తన శాఖలో ఆయన జోక్యమేంటని ప్రశ్నిస్తూ… సీఎంతో పాటు పార్టీ అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

మరోవైపు కొండా మురళీ కూడా మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో సదరు మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గత కొంత కాలంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునరుద్ధరించే దిశగా మాస్టర్ ప్లాన్ ను కూడా రూపొందించారు. మాస్టర్​ప్లాన్ అమలులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గత నెల 23న మేడారాన్ని కూడా సీఎం రేవంత్ సందర్శించారు. ఈ కార్యక్రమాలన్నీ మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమై… వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య టెండర్ల వార్ తెరపైకి రావటంతో… పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది…! ఈ వివాదంపై మంత్రి కొండా వైపు నుంచి గానీ మంత్రి పొంగులేటి వైపు నుంచి కానీ అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు..!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం