కమీషన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. సెల్ఫ్ గోల్ పడటంతో క్లారిటీ ఇచ్చిన మంత్రి!-minister konda surekha clarifies on her comments on commissions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కమీషన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. సెల్ఫ్ గోల్ పడటంతో క్లారిటీ ఇచ్చిన మంత్రి!

కమీషన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. సెల్ఫ్ గోల్ పడటంతో క్లారిటీ ఇచ్చిన మంత్రి!

HT Telugu Desk HT Telugu

మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. ప్రతిపక్షాలు ఆ మాటలను ట్రోల్ చేస్తున్నాయి. కొండా సురేఖ మాటలతో రాజకీయ దుమారం చెలరేగడంతో.. అధిష్టానం ఆమె తీరు పట్ల సీరియస్ అయినట్లు తెలిసింది.

మీడియాతో మాట్లాడుతున్న కొండా సురేఖ

వరంగల్ నగరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నోరు జారారు. ‘అటవీ శాఖ మంత్రిగా ఉండటం వల్ల కొన్ని కంపెనీలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం నా వద్దకు వస్తాయి. సాధారణంగా ఫైళ్లను క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని, దానికి బదులు పాఠశాలలు నిర్మించి, సమాజ సేవ చేయాలని వారికి చెబుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు పైసలు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దానిని కాంగ్రెస్ మంత్రులకకు ఆపాదించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది.

స్పందించిన కేటీఆర్..

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణం కాగా.. ఈ మాటలను ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలుగా మార్చుకున్నాయి. మంత్రి కొండా సురేఖ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం అంటూ.. విమర్శలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయమై ఎక్స్ వేదికగా స్పందించారు. నిజాలు మాట్లాడినందుకు కొండా సురేఖకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమీషన్ సర్కారు నడుస్తోందని, ఈ కమీషన్ ప్రభుత్వంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఫైళ్ల మీద సంతకాలు పెట్టరని సహచర మంత్రులే చెబుతున్నారని.. ట్వీట్ చేశారు. ఆ కమీషన్ మంత్రులు పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

సురేఖ క్లారిటీ..

వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలు వైరల్ కావడం, దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో.. మంత్రి కొండా సురేఖ స్పందించారు. హనుమకొండ రాంనగర్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి, తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకుని పనులు చేశారని చెప్పారు. తాను కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా పని చేసిన నేతలు.. సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండని హితవు పలికారు. మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత పెరిగాయో.. ఎంక్వైరీ చేయిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు.

బద్నాం చేస్తున్నారు..

తాను మాట్లాడిన దాంట్లో పూర్తి వీడియో ప్రసారం చేయకుండా.. ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంతను కొండంతలుగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు మాత్రమే అందాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని, ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతుంటే విష ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు సెక్రటేరియట్ ను చెడగొట్టి పోయారని.. ప్రతి చిన్న ఫైల్ కి డబ్బులు తీసుకునే తీరుగా మార్చారని ఆరోపించారు. మంత్రులు తప్పు చేశారంటూ చేస్తున్న ట్రోలింగ్ ఆపకపోతే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తామని కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు.

మీకు ఆస్తులెలా వచ్చాయి..?

తాము ఏం మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు భూతుగా చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తాను మంత్రులెవరైనా అని మాట్లాడానని, కానీ కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా అనలేదని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్, కవితకు ఇంత పెద్దమొత్తంలో ఆస్తులెలా వచ్చాయని ప్రశ్నించారు. ఇల్లే లేదని చెప్పిన కవితకు.. అంత పెద్ద భవనం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ కు ఫామ్ హౌజ్ ఎలా వచ్చిందని నిలదీశారు. అవినీతికి పాల్పడకపోతే అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడి, కాంగ్రెస్ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.