Complaint On N Convention : మంత్రి ఫిర్యాదుతో కదిలిన 'హైడ్రా' - N కన్వెన్షన్ కూల్చివేతలో కీలక విషయాలు-minister komatireddy venkat reddy complained against n convention encroachment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Complaint On N Convention : మంత్రి ఫిర్యాదుతో కదిలిన 'హైడ్రా' - N కన్వెన్షన్ కూల్చివేతలో కీలక విషయాలు

Complaint On N Convention : మంత్రి ఫిర్యాదుతో కదిలిన 'హైడ్రా' - N కన్వెన్షన్ కూల్చివేతలో కీలక విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 24, 2024 12:26 PM IST

ఎన్- కన్వెన్షన్ నిర్మాణంపై హైడ్రా చర్యలు చేపట్టడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయమే అధికారులు కన్వెన్షన్ సెంటర్ కు వద్దకు చేరుకుని కూల్చివేయించారు. అయితే ఎన్ - కన్వెన్షన్ నిర్మాణంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి … ముఖ్యమంత్రితో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఎన్ - కన్వెన్షన్ పై మంత్రి ఫిర్యాదు
ఎన్ - కన్వెన్షన్ పై మంత్రి ఫిర్యాదు

నాగార్జున ఎన్- కన్వెన్షన్ నిర్మాణంపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను ఇవాళ ఉదయం కూల్చివేయించారు. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందటంతో ఈ చర్యలు తీసుకున్నారు. మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎన్-కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించబడి ఉంది.

సినీ హీరో అఖినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు. అయితే ఇటీవలే రాష్ట్ర కేబినెట్ లోని మంత్రి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేయటంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు..!

ఎన్ - కన్వెన్షన్ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగస్టు 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగానాథ్ కు కూడా ఓ లేఖను రాశారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ లో ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపారు. శాటిలైట్ ఫోటోలతో సహా పలు ఆధారాలను తన ఫిర్యాదుకు జత చేశారు.

మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు… నేరుగా రంగంలోకి దిగారు. శనివారం ఉదయమే ఎన్ - కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకుని కూల్చివేత పనులను ప్రారంభించారు. యంత్రాల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. పరిసర ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ లోకి వెళ్లే దారులను కూడా మూసివేశారు. లోపలికి కూడా ఎవర్నీ అనుమతించలేదు. ఎంత వరకైతే ఆక్రమణ జరిగిందో అక్కడి వరకు ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు.

మొత్తం 10 ఎకరాల్లో ఎన్‌-కన్వెన్షన్‌ నిర్మాణం ఉండగా అందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 2 ఎకరాలు బఫర్‌ జోన్‌ లో ఉందంటున్నారు. చెరువు ఆక్రమణ జరిగిన నేపథ్యంలోనే కూల్చివేశామని అంటున్నారు. ఇక మాదాపూర్ లో ఉన్న ఎన్‌-కన్వెన్షన్‌లో హీరో అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి భాగస్వామ్యులుగా ఉన్నారు.

హైడ్రా ఏంటి..?

హైడ్రా అనేది ఇటీవలే ఏర్పాటైంది.  హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు ఉంటుంది. హైడ్రా ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు.

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి హైడ్రా కిందకే వచ్చాయి.ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా… చాలాచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్ లు కూడా చర్చకు వస్తున్నాయి.

సంబంధిత కథనం