Minister Harish Rao | ఉస్మానియా ఆసుపత్రిలో మూడు పూటలా భోజన పథకం ప్రారంభం
హైదరాబాద్ లోని 18 ఆసుపత్రుల్లో మూడు పూటలా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప మానవతావాది అని కొనియాడారు.
ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకులకు మూడు పూటలా భోజన పథకం, ఆర్థోపెడిక్ అకాడమిక్ బ్లాక్, ఆపరేషన్ థియేటర్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజసింగ్, టి ఎస్ఎమ్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గతంలో రేషన్ బియ్యం మనిషికి నాలుగు కిలోలు చొప్పున ఇచ్చేవారని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక.. ఒక్క రూపాయికే కిలో బియ్యాన్ని, ఇంట్లో ఎంత మంది ఉన్నా.. ఒక్కక్కోరికి 6 కేజీలు ఇచ్చేలా ఆదేశించారన్నారు. సన్న బియ్యంతో పిల్లలు తిన్నంత ఆహారం పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. 'ఆసరా పెన్షన్ 200 నుంచి 2 వేలకు పెంచారు. దీంతో వృద్ధులు, వితంతువులు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు. దేశంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డ పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో, కరోనా సమయంలో గాంధీకి వెళ్ళినప్పుడు పేషెంట్ సహాయకుల బాధ చూశారు. వారికి 3 పూటలా ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 18 ఆసుపత్రుల్లో రోజు 20 వేల భోజనాలు అందిస్తున్నాం' అని హరీశ్ రావు అన్నారు.
ఆసుపత్రుల్లో ఉచిత భోజనం కోసం ప్రభుత్వం రూ.40 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని మంత్రి హారీశ్ రావు అన్నారు. గ్రేటర్ లో అన్ని నైట్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే డైట్ ఛార్జీలను కూడా రెట్టింపు చేసినట్టుగా తెలిపారు. ప్రభుత్వంపై 43 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని పేర్కొన్నారు. టెండర్లు కూడా చివరి దశలో ఉన్నాయన్నారు. పారిశుద్ధ్యం కోసం ఒక్కో బెడ్ కు చెల్లించే మొత్తం 5000 నుంచి 7500కు పెంచామని తెలిపారు. ఏటా రూ.338 కోట్ల భారం పడుతుందన్నారు.
ఈ సందర్భంగా రూ. 2679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. టిమ్స్, నిమ్స్ లో 2 వేల పడకలు ఏర్పాటుకి ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. అల్వాల్ లో ఎమ్ సీహెచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 'ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం రూ.36 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను ఈ రోజు ప్రారంభించాం. ఉస్మానియా పాత భవనం వివాదం నేపథ్యంలో.. వారసత్వ కట్టడాన్ని కాపాడుతూనే కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. కమిటీ ప్రాథమిక నివేదిక అందింది. పూర్తి నివేదిక అందిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు.' అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
టాపిక్