Minister Harish Rao : కాంగ్రెస్‍కు విండీస్ క్రికెట్ టీం పరిస్థితే - మంత్రి హరీశ్ ఆసక్తికర కామెంట్స్
TS Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ ను విండీస్ క్రికెట్ టీమ్ తో పోల్చారు మంత్రి హరీశ్ రావు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదన్నారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు మంత్రి హరీశ్ రావు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే… ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ టీంగా ఉన్న వెస్టిండీస్ టీం పరిస్థితి లాగే ఉందంటూ ఎద్దేవా చేశారు. శనివారం జహీరాబాద్ సభలో మాట్లాడిన మంత్రి హరీశ్…. వన్డే వరల్డ్ కప్ మొదలైన తర్వాత, 1975,1979 లో వెస్టిండీస్ గెలిచిందని ఆ తర్వాత తిరుగులేని జట్టుగా కొనసాగుతూ వచ్చిందన్నారు,
“దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత… 50 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ని ఢికొట్టే బలం ఏ పార్టీ కి ఉండేది కాదు. ప్రపంచ క్రికెట్ లో 1990 దశకంలో ప్రపంచ క్రికెట్లో వెస్ట్ ఇండీస్ ఎలా పడిపోయిందో… ప్రస్తుతం దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల మద్దతు కోల్పోయింది. 2023 వరల్డ్ కప్ లో కూడా కనీసం క్వాలిఫై కాలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా సాధించలేదు. 2018 ఎన్నికల్లో సాధించిన 88 సీట్లను పెంచుకొని… 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) 100 సీట్లు గెలిచి ఈ సారి సెంచరీ కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సాధించలేక రన్ అవుట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2018 లో సాధించిన ఒక్క సీట్ కూడా కోల్పోయి డకౌట్ అవుతుంది ” అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాటు అధికారంలో ఉండి…ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు మంత్రి హరీశ్. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు చేసిందేమి లేదన్నారు. గీతారెడ్డి డాక్టర్ అయ్యి ఉండి కూడా జహీరాబాద్ ని ఎనాడు పట్టించుకోలేదని హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ లో నాడు నీళ్లకు గోస ఉండేది కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ వచ్చాక ఆ కష్టాలన్నీ తీరినాయి అని అన్నాడు.
“ఎమ్మెల్యే మాణిక్ రావు కోరిక మేరకు 12 కోట్లతో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మంజూరు చేశాం .జహీరాబాద్ లో ఎక్కువగా డెలివరీలు సర్కారు దవాఖానలో జరుగుతున్నాయి.డయాలసిస్ సెంటర్ పెట్టి పేదలకు వైద్యం చేరువ చేశాం. ఇప్పటివరకు 12 లక్షల 70 వేల ఆడబిడ్డల పెళ్లిళ్లకు 11 వేల కోట్లు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు రూపంలో ఇచ్చాం. తెలంగాణ లో వచ్చేది హ్యాట్రిక్ ప్రభుత్వం అని తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా. గుండె గుండెలో, గుడిసె గుడిసెలో కేసీఅర్ ఉన్నాడు” అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.