Harish Rao : కేంద్ర మంత్రులది రోజుకో మాట... మంత్రి హరీశ్ రావు
Harish Rao : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు రావాల్సి ఉందని.. వాటిని ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. సీఎం కేసీఆర్ పై ఆమె వ్యాఖ్యల్ని ఖండించిన హరీశ్... మెడికల్ కాలేజీలపై కేంద్ర మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao : రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తోందని.. తొమ్మిదేళ్లలో రూ1.39 లక్షల కోట్లు ఇచ్చామని.. కేంద్రం కోరినా మెడికల్ కాలేజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంప లేదన్న ... కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను... మంత్రి హరీశ్ రావు ఖండించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పూర్తి ఆధారాలు, లెక్కలతో మాట్లాడారని మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేస్తామని కేంద్రం చెప్పిందని.... కానీ ఇప్పటి వరకు సాధించింది 3.3 ట్రిలియన్ మాత్రమేనన్నారు. ఒక్క ఏడాదిలో మిగతా లక్ష్యాన్ని సాధించడం సాధ్యమా అని ప్రశ్నించిన ఆయన.. సీఎం కేసీఆర్ అదే అడిగారని.. అందులో జోక్ ఏముందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రులది రోజుకో మాట అని మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రతిపాదనలే రాలేదు అని కేంద్ర వైద్యారోగ్య మంత్రి పార్లమెంట్‌లో చెప్పారని... రెండు జిల్లాలకు ప్రతిపాదనలు పంపారని నిర్మలా సీతారామన్ అంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలా తలా ఓ మాటతో ఎవరు ఎవర్ని తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ ప్రశ్నించారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తామంటే... తెలంగాణ ప్రభుత్వం కూడా వినతులు పంపిందని స్పష్టం చేశారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టే.. కొత్తవి ఇవ్వలేదని కేంద్రం చెబుతోందని.... మరి ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలకు కొత్తవి ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా ? అని నిలదీశారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు రాకుండా పోతున్నాయని అన్నారు. ఆరోగ్య శ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్లు ఖర్చు చేస్తుంటే.... ఆయుష్మాన్ ద్వారా మాత్రం రూ. 150 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు మంత్రి హరీశ్.
కేంద్రం నుంచి రూ. 1.25 లక్షల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని.. అవే వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను హరీశ్ కోరారు. సుమారు 38 వేల కోట్ల రూపాయలు గత బడ్జెట్ అంచనాలను అనుసరించి కేంద్రం నుంచి రావాల్సినవి రాలేదని చెప్పారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నందుకు రూ.16,653 కోట్లు కోల్పోయామన్నారు. రైతుల పక్షాన రక్షగా నిలిచినందుకు రాష్ట్రానికి కేంద్రం శిక్ష విధించిందని.... ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అయిన 2021-2026 ఐదేండ్ల కాలంలో రూ. 30 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాకుండా పోతాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడే రాష్ట్రం అప్పులు తీసుకుందన్న హరీశ్.. ఆ అప్పులతో తెలంగాణకు ఆస్తుల కల్పన చేశామని.. భావి తరాలకు అద్బుత సంపద సృష్టించామని అన్నారు. డెట్ జీడీపీ రేషియోలో తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో చివరి నుంచి తెలంగాణ ఆరో స్థానంలో ఉందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద పెరిగిందని.. నాడు జీఎస్డీపీ నాలుగున్నర లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ. 13 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. కేంద్రం నుంచి రూ. 1.25 లక్షల కోట్లు రావాల్సి ఉందని... వాటిని వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని కోరారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నందుకు రూ. 16,653 కోట్లు కోల్పోయామని... కేంద్రం తీరుతో 2021-2026 ఐదేండ్ల కాలంలో రూ. 30 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాకుండా పోతాయని చెప్పారు. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ రూ. 5,374 కోట్ల రూపాయలను బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందన్నారు.ఫైనాన్స్ కమిషన్ 2022-23 బకాయిలు రూ. 2,016 కోట్ల రూపాయల విషయంలో కేంద్రం మొండి చేయి చూపించిందని.... జీఎస్టీ పరిహారం కింద కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు రూ. 2,437 కోట్ల రూపాయలను ఇప్పటికీ విడుదల చేయలేదని వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులకు సైతం ఎగనామం పెట్టిందని చెప్పారు.