Minister Harish Rao : శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్‌లు-minister harish rao about organ donation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao About Organ Donation

Minister Harish Rao : శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్‌లు

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 05:33 PM IST

Organ Donation Day : శారీరక శ్రమ లేకపోవడం వల్లే ప్రజలు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

అవయవ దానం(Organ Donation) తరహాలో ఆరోగ్య పరిరక్షణ కూడా దేశానికి దిక్సూచిగా మారుతోందని మంత్రి హరీశ్​రావు చెప్పారు. గాంధీ వైద్య కళాశాల(Gandhi Medical College)లో జాతీయ అవయవదాన దినోత్సవంలో పాల్గొన్నారు. అవయవ దానం చేసిన వారిని సన్మానించారు. గాంధీ ఆస్పత్రికి రూ.35 కోట్లతో అవయవ మార్పిడి విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. శారీరక శ్రమ లేకపోవడం వల్లే ప్రజలు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) మాట్లాడారు 'విద్య, మహిళా సంక్షేమం, ఆయుష్ శాఖల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మిషన్ భగీరథ, రూరల్ డెవలప్ మెంట్, అర్బన్ డెవలప్ మెంట్ ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చు.' అని హరీశ్ రావు అన్నారు.

గతంలో డబ్బులున్న వారికే అవయవ మార్పిడి చేసుకునేవారు అన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్(CM KCR) ప్రత్యేక చొరవతో పేదలు కూడా అవయవ మార్పిడి చేయించుకోగలుగుతున్నారని హరీశ్ రావు చెప్పారు. అవయవ మార్పిడి ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తున్నట్టుగా వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి బ్లాక్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ లభిస్తుందన్నారు.

వచ్చే ఆరు నెలల్లో రూ.35 కోట్ల విలువైన పరికరాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. అవయవ మార్పిడిలో ప్రైవేట్ దవాఖానలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవయవ దాతల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ప్రస్తుతం 3000 మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని, రోడ్డు ప్రమాదాలు(Road Accidents) ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

'రోగికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపై ఉంది. ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్య పరిరక్షణ పేరుతో ఆయుష్ ద్వారా ముందస్తు చర్యలు చేపడతాం. అవయవ దానం తరహాలో ఆరోగ్య పరిరక్షణ కూడా దేశానికే దిక్సూచిగా మారుతోంది.' అని హరీశ్ రావు అన్నారు.

WhatsApp channel