అడవి తల్లులను దర్శించుకుంటే చాలు.. అంతా మంచే జరుగుతుంది. అమ్మల చల్లని చూపు.. కొండంత బలం. ఇక్కడ.. ప్రకృతే దేవతలు. సమ్మక్క, సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది.
రెండేళ్లకోసారి ఎంతో ఘనంగా జాతర జరుగుతుంటోంది. కోట్లాది మంది భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. అయితే మధ్యలో మినీ మేడారం జాతర కూడా జరుపుతుంటారు. ఇందుకు సంబంధించిన తేదీలను పూజరులు ప్రకటించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి మినీ మేడారం జాతర నిర్వహించనున్నట్టు పూజారు ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటించారు. ఫిబ్రవరి 15 వరకు నాలుగు రోజలపాటు మినీ జాతరను నిర్వహించాలని నిర్ణయించారు. మినీ జాతర (మండె మెలిగే పండగను) పురస్కరించుకొని అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మహాజాతర మాదిరిగానే ఉంటాయి. మరోవైపు మినీ మేడారం జాతరకు కూడా భక్తులు భారీ స్థాయిలో తరలివస్తుంటారు.
చరిత్ర ప్రకారం చూస్తే… కాకతీయుల కాలంలో కొంతమంది పాలకులు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఇద్దరు తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మల పోరాటాన్ని ఈ జాతర గుర్తు చేస్తుంది, అనంతర పరిణామాల తర్వాత కాకతీయ రాజులు తమ తప్పులు తెలుసుకొని సమ్మక్కకు భక్తులుగా మారినట్లు చరిత్ర చెబుతుంది.
సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు కేవలం గిరిజనులు మాత్రమే చిలకలగుట్ట అనే ఒక కొండపైన జరుపుకునే వారు, కానీ 1940 తర్వాత నుంచి తెలంగాణలో అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజలంతా కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు.
అమ్మవార్ల చిహ్నంగా సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఏర్పాటై ఉన్నాయి. జాతర జరిగే నాలుగు రోజుల పాటు వివిధ ఘట్టాలు ఉంటాయి. ఈ తంతునంతా ఎంతో నిష్ఠగా జరిపేది వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే కావడం ఈ జాతరకున్న మరో ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు.
మేడారం జాతరకు రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా చేరుకునే సౌకర్యం ఉంది. వరంగల్ తొలి గమ్యస్థానంగా గుర్తుంచుకోవాలి. రోడ్డు మార్గంలో అయితే జాతర సమయంలో హైదరాబాద్, వరంగల్ ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. సొంత వాహనాలు, టాక్సీల్లో కూడా చేరుకోవచ్చు.
రైలు మార్గంలో అయితే ముందుగా వరంగల్ స్టేషన్ చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఆర్టీసి బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ టాక్సీలు కూడా చాలా నడుస్తాయి.