Singareni Accident: సింగరేణిలో గని ప్రమాదం, ఆఇద్దరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు, ఆర్టీ3లో ఘటన-mine accident in singareni two dead two others injured incident on rt3 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Accident: సింగరేణిలో గని ప్రమాదం, ఆఇద్దరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు, ఆర్టీ3లో ఘటన

Singareni Accident: సింగరేణిలో గని ప్రమాదం, ఆఇద్దరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు, ఆర్టీ3లో ఘటన

HT Telugu Desk HT Telugu
Jul 18, 2024 06:15 AM IST

Singareni Accident: పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2 లో ఘోర ప్రమాదం జరిగింది. మట్టిపెళ్ళలు విరిగి పడడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.

సింగరేణి ఆర్జీ 3లో గని ప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి
సింగరేణి ఆర్జీ 3లో గని ప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి

Singareni Accident: పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2 లో ఘోర ప్రమాదం జరిగింది. మట్టిపెళ్ళలు విరిగి పడడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 2 లో పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులు నాలుగురు చేస్తుండగా మట్టిపెళ్ళలు విరిగిపడ్డడంతో ప్రమాదం జరిగింది.

yearly horoscope entry point

ప్రమాదంలో నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. మట్టిలో కూరుక్కుపోయిన వారిని వెంటనే సింగరేణి రెస్క్యూ టీం బయటకు తీసేలోపే ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ మృతి చెందారు. సమ్మయ్య, VSN రాజు లు గాయపడ్డారు. వారిని హుటాహుటిన గోదావరిఖని లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మిన్నంటిన రోదనలు..

ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం మరో ఇద్దరు గాయపడడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తొలి ఏకాదశి పండుగ పూట పనికి వెళ్ళి విగతజీవిగా తిరిగి రావడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సింగరేణి అధికారులతో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు, మృతుల కుటుంబాలను పరామర్శించి జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సింగరేణి అధికారులు ప్రకటించారు.

ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణం...

ఓసిపి2 లో మట్టి పెళ్ళలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందడం, మరో ఇద్దరు కార్మికులు గాయపడడం పట్ల కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఓసిపి2 సౌత్ కోల్ ఏరియాలో సైడ్ వాల్ లోపల పైప్ లేకేజీ పై సరైన అవగాహన లేకుండా యాజమాన్యం కార్మికులతో పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.‌

ఇటీవల ఓసీపీ-2 లో కక్షసాధింపు చర్యల్లో భాగంగా జరిగిన షిఫ్ట్ చేంజ్ లో ఉప్పు వెంకటేశ్వర్లును సెక్షన్ మార్చడంతో ఆయన ఇటీవల పంప్ సెక్షన్ కు వెళ్ళాడని సరైన పరిజ్ఞానం లేని వారిచే పనులు చేయించడం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్లక్ష్యంతో పని సెక్షన్ చేంజ్ చేయడంతో ఇటీవల ఆంజనేయులు అనే కార్మికుడు మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని కార్మిక సంఘాలు ఆరోపించాయి.

కార్మికుల సంక్షేమంపై యాజమాన్యంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇష్టారాజ్యంగా విధులు కేటాయించకుండా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జరిగిన ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలను ఆదుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసిపి2లో జరిగిన గని ప్రమాదంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా సింగరేణి యాజమాన్యం అన్ని విధాల ఆదుకుంటుందని ప్రకటించారు.

(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner