TG Govt Skills University : స్కిల్స్ యూనివర్సిటీకి బిగ్ బూస్ట్ - రూ. 200 కోట్లు ప్రకటించిన ‘మేఘా’ కంపెనీ-megha engineering infrastructure limited announced 200 crore for the construction of skills university in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Skills University : స్కిల్స్ యూనివర్సిటీకి బిగ్ బూస్ట్ - రూ. 200 కోట్లు ప్రకటించిన ‘మేఘా’ కంపెనీ

TG Govt Skills University : స్కిల్స్ యూనివర్సిటీకి బిగ్ బూస్ట్ - రూ. 200 కోట్లు ప్రకటించిన ‘మేఘా’ కంపెనీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Updated Oct 27, 2024 11:11 AM IST

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. వర్శిటీ క్యాంపస్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది.

రూ.200 కోట్లు ప్రకటించిన మేఘా కృష్ణారెడ్డి
రూ.200 కోట్లు ప్రకటించిన మేఘా కృష్ణారెడ్డి

తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు మేఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మేఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందంతో సంప్రదింపులు జరిపారు. స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.

ఈ క్యాంపస్‌లో అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తామని పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి… మెఘా కంపెనీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.

హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ శ్రేణి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ నిర్మాణానికి గత ఆగస్టులోనే ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8వ తేదీన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.

కొనసాగుతున్న ఆన్ లైన్ దరఖాస్తులు…

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా చేరాల్సి ఉంటుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://yisu.in  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా Hyderabad గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహిస్తారు.

  • తొలి విడతగా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నారు.
  • లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించారు. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరవచ్చు.
  • తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.
  • ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్..తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారు.
  • ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది.
  • తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నియమితులయ్యారు. ఆనంద్‌ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో ఉండనున్నారు.

 

Whats_app_banner