Meerpet Murder Case : మీర్ పేట మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు వెలుగులోకి-meerpet murder case husband killed wife cut into pieces burnt make power says cp sudheer babu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Meerpet Murder Case : మీర్ పేట మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు వెలుగులోకి

Meerpet Murder Case : మీర్ పేట మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు వెలుగులోకి

Bandaru Satyaprasad HT Telugu
Jan 28, 2025 08:23 PM IST

Meerpet Murder Case : మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశాడు నిందితుడు గురుమూర్తి. భార్యను హత్య చేసిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపంలేదని సీపీ సుధీర్ బాబు అన్నారు.

మీర్ పేట్ మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు చెప్పిన సీపీ
మీర్ పేట్ మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు చెప్పిన సీపీ

Meerpet Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. వెంకట మాధవి హత్య కేసులో ఆధారాలు సేకరించడానికి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. భార్యను ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా? అని నివ్వెరపోయామన్నారు.

yearly horoscope entry point

అసలేం జరిగింది?

"ఈ నెల 18వ తేదీన తన కూతురు వెంకట మాధవి తప్పిపోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన పెద్ద కూతురు పుట్టా వెంకట మాధవి ఆమె భర్త గురుమూర్తి, ఇద్దరు పిల్లలతో జిల్లెలగూడ గ్రామంలో నివసిస్తుంది. ఈ నెల 16న వెంకట మాధవి, ఆమె భర్త గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన తన కుమార్తె మాధవి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి బంధువులను విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. కూతురు ఇంటికి తిరిగి రాలేదని వెంకట మాధవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఇంటి ఓనర్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ నెల 15న నిందితుడు గురుమూర్తి, భార్య వెంకట మాధవితో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెంకట మాధవి బయటికి వెళ్లిన ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజీల్లో నిందితుడు తన భార్యను ఇంట్లోనే హత్య చేసి ఉంటాడని స్పష్టంగా తెలుస్తోంది"- సీపీ సుధీర్ బాబు

పక్కా ప్లాన్ ప్రకారం

"ఇవాళ అనుమానాస్పద కారణాలతో నిందితుడు గురుమూర్తిని పీఎస్‌కు తీసుకొచ్చి విచారించారు. విచారణలో అసలు విషయాలు చెప్పాడు. ఈ నెల 14వ తేదీ ఉదయం డీఆర్‌డీఎల్, కంచన్ బాగ్‌లో విధులకు హాజరయ్యేందుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చానని ఒప్పుకున్నాడు. ఫ్రెష్ అయ్యి, తన భార్య మాధవి, వారి ఇద్దరు పిల్లలను బడంగ్ పేటలో తన అక్క సుజాత వాళ్ల ఇంటికి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తీసుకువెళ్లాడు.

అదే రోజు పిల్లలను అతని సోదరి ఇంట్లో వదిలి రాత్రికి జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలోని తమ ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు, అంటే 15వ తేదీన వారు మళ్లీ బడంగ్‌పేటలోని అతని సోదరి ఇంటికి వెళ్లారు. ఆ రోజు కూడా తమ పిల్లలను అతని సోదరి వద్ద వదిలి రాత్రి 10:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రాత్రి ఇద్దరూ తమ ఇంట్లో పడుకున్నారు.

ఈ నెల 16వ తేదీ ఉదయం 8:00 గంటలకు తన భార్యతో వాగ్వాదానికి దిగిన గురుమూర్తి కోపంతో ఆమెను చంపాలనే ఉద్దేశంతో గట్టిగా కొట్టాడు. ఆమె తల గోడకు తగిలి కుప్పకూలింది. ఆ తర్వాత భార్య గొంతు కోసి చంపాడు. హత్యను కప్పిపుచ్చాలని నిర్ణయించుకున్నాడు గురుమూర్తి. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. వెంకట మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులు, బంధువులను నమ్మించేలా ప్లాన్ చేశాడు.

అనంతరం భార్య మృతదేహాన్ని బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి దుస్తులను తొలగించి బెడ్‌రూమ్‌లోని బెడ్‌పై పడేశాడు. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకొచ్చి మొదట రెండు భుజాల దగ్గర కోసి, రెండు కాళ్లను నడుము వద్ద కోసి, ఆ తర్వాత భార్య చేతులు, కాళ్లను చిన్న ముక్కలుగా కోసి బకెట్‌లో ఉంచాడు" అని సీపీ సుధీర్ బాబు తెలిపారు.

గ్యాస్ స్టవ్ పై కాల్చి

"వాటర్ హీటర్ ఉపయోగించి నీటిని వేడి చేసి, శరీర భాగాలను ఉడకబెట్టాడు. తరువాత వాటిని గ్యాస్ స్టవ్‌పై కాల్చాడు. కాలిన తర్వాత, స్టోన్ రోలర్‌తో ఎముకలను నలిపి పొడిగా చేశాడు. ఎముకల పొడి, చిన్న మాంసపు ముక్కలను టాయిలెట్‌లో పడేశాడు. బాత్రూమ్ నీటితో ఫ్లష్ చేశాడు. మిగిలిన చిన్న ఎముకలను ఇంటి డస్ట్ బిన్‌లో ఉంచాడు. ఆ తరువాత వాటిని పడేయాలని నిర్ణయించుకున్నాడు.

మాంసం ముక్కలు కాలుతున్నప్పుడు దుర్వాసన రాకుండా తలుపులు, వంటగది కిటికీలు తెరిచి ఉంచాడు. ముక్కలుగా నరికి మృతదేహాన్ని పారవేయడానికి అతనికి దాదాపు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 6:00 వరకు అంటే 8 గంటలు పట్టింది. ఆ తర్వాత, డిటర్జెంట్, ఫినైల్ ఉపయోగించి బాత్రూమ్‌ను శుభ్రం చేశాడు. భార్యను అమానవీయంగా హత్య చేశాడు.

తల్లి ఏదని పిల్లలు అడిగితే ఎక్కడికో వెళ్లిందని చెప్పాడు. చంపినట్లు ఆధారాలు లేకపోతే కేసు నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు గురుమూర్తి భావించాడు. పిల్లలు ఉంటే సాక్ష్యం చెబుతారనే అనుమానంతో వారిని అక్క ఇంటి వద్దే ఉంచాడు. రెండ్రోజుల తర్వాత మాధవి తల్లిదండ్రులు తమ కూతురు గురించి అడిగితే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కేసు పెట్టారు.

నిందితుడు గురుమూర్తి చాలా క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తి. ఆర్మీలో 15 ఏళ్లు పనిచేసిన అతడు పక్కా ప్లాన్ ప్రకారం భార్యను హత్య చేశాడు. భార్యను అత్యంత కిరాతకంగా చంపిన గురుమూర్తిలో కొంచమైనా పశ్చాత్తాపం లేదు. హత్య కేసులో నిందితుడు ఉపయోగించిన మొత్తం 16 వస్తువులను సీజ్‌ చేశాం’’ అని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Whats_app_banner