AICC Telangana Incharge : దీపాదాస్ మున్షీ ఔట్...! తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చేశారు. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇంఛార్జ్ మార్పు చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించగా... ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఇప్పటివరకు పని చేసిన దీపాదాస్ మున్షీ స్థానంలో.... కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది.
కొత్త ఇంఛార్జ్ నేపథ్యం….
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత NSUIలోకి ఎంట్రీ చేశారు. 1999–2002 వరకు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతేకాకుండా 2002-2005 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు.
2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చి నాయకురాలిగా మీనాక్షి నటరాజన్ కు పేరుంది. ప్రస్తుతం ఆమె... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఉన్నారు.
చర్చనీయాంశంగా మార్పు నిర్ణయం…!
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇలాంటి కీలక సమయంలో ప్రస్తుతం ఉన్న ఇంఛార్జ్ ను మార్చటం చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్దిరోజులుగా దీపాదాస్ మున్షిని మారుస్తారనే చర్చ జోరుగా జరిగింది. దీపాదాస్ మున్షీపై పలువురు కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఆందటంతో పాటు నాయకుల మధ్య సమన్వయం కుదర్చ లేకపోయారన్న విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆమెకు అధినాయకత్వం ఉద్వాసన పలుకినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కొత్త ఇంఛార్జ్ లు:
- తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ - మీనాక్షి నటరాజన్
- హిమాచల్ ప్రదేశ్, ఛండీగర్ ఇంఛార్జ్ - రజనీ పాటిల్
- ఒడిశా - అజయ్ కుమార్ లల్లూ
- హర్యానా - బీకే హరిప్రసాద్
- జార్ఖండ్ - కే రాజు
- మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ - సప్తగిరి శంకర్ ఉల్కా
- బిహార్ రాష్ట్ర - కృష్ణ అల్లవారు
- మధ్యప్రదేశ్ - హరీష్ చౌదరి
- తమిళనాడు, పాండిచ్చేరి - గిరీశ్ చోడాంకర్
సంబంధిత కథనం