Medchal Murder : మేడ్చల్ లో దారుణం- నడిరోడ్డుపై కత్తులతో దాడి, యువకుడి దారుణ హత్య
Medchal Murder : మేడ్చల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్‌గా తెలుస్తోంది.

Medchal Murder : మేడ్చల్ లో దారుణం జరిగింది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే...ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు అతిదారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఘాతుకానికి పాల్పడ్డారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్‌గా తెలుస్తోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నడిరోడ్డుపై కత్తుతో ఉమేశ్‌పై దాడి చేస్తుండగా జనం చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా ఈ దారుణాన్ని వీడియోలు తీసుకున్నారు. ఉమేశ్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు.
ఉమేశ్ ను హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగింది?
మేడ్చల్ మర్డర్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఉమేశ్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. సొంత అన్న అయిన ఉమేశ్ ను అతని తమ్ముడు, వరుసకు తమ్ముడయ్యే మరో యువకుడు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు కారణం కుటుంబ కలహాలేనని పోలీసులు విచారణలో తెలిసింది. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారం పేటకు చెందిన గన్యా మేడ్చల్ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ నిమ్మిత్తం కుటుంబంతో సహా మేడ్చల్ లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఉమేశ్, రాకేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెద్ద కొడుకైన ఉమేశ్ గత కొద్ది రోజులుగా ఏ పని చేయకుండా తిరుగుతూ మద్యం మత్తులో తల్లిని కొట్టి వేధింపులకు గురి చేస్తున్నాడు. అన్న ఉమేశ్ ప్రవర్తనతో విసిగిపోయిన రాకేశ్.. బంధువుల అబ్బాయి లక్ష్మణ్ తో కలిసి ఇద్దరు ఉమేశ్ తో గొడవ పడ్డారు. వారి వద్దనుంచి తప్పించుకుని రోడ్డుపైకి రావడంతో అక్కడే కింద పడేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. నిందితులు రాకేశ్, లక్ష్మణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉమేశ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం