CMR Students Protest: బాత్‌రూమ్‌లో వీడియో తీశారంటూ మేడ్చల్ సిఎంఆర్ విద్యార్థినుల ఆందోళన
CMR Students Protest: హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ మేడ్చల్‌లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీశారని ఆరోపిస్తూ రాత్రి పొద్దు పోయే వరకు ఆందోళనకు దిగారు.
CMR Students Protest: హాస్టల్ విద్యార్ధినులను స్నానాల గదుల్లో అసభ్యంగా వీడియోలు తీశారని ఆరోపిస్తూ బుదవారం రాత్రి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. మేడ్చల్‌లోని కండ్లకోయ సీఎమ్మార్ ఐటీ కాలేజీ విద్యార్థినుల వసతిగృహంలో వీడియోలు చిత్రీకరించారని ధర్నాకు దిగారు. విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.
కాలేజీ హాస్టల్లో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థినులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పనిచేసే సిబ్బందిలో కొందరు బాత్రూంలో విద్యార్థినుల వీడియోలు తీశారని యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. బాత్‌రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని వార్డెన్‌కు చెబితే విద్యార్థినులనే చులకన చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
హాస్టల్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినా యాజమాన్యం పట్టించుకోక పోవడంతో ధర్నాకు దిగారు. విద్యార్థినులు బుధవారం అర్థరాత్రి దాటే వరకు ఆందోళన కొనసాగించారు. విద్యార్థినులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను కాలేజీలోకి అనుమతించక పోవడంతో వారు గేటు బయట ధర్నాకు దిగారు.
సెక్యూరిటీ సిబ్బంది గదిపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. విద్యార్థినుల ఆందోళనతో పోలీసులు వసతిగృహం నిర్వాహకులతో చర్చలు జరిపారు. అక్కడ పనిచేసే సిబ్బంది వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లు, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్ధినుల బాత్‌రూమ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థులు హెచ్చరించారు.