Medak News : మెదక్ జిల్లాలో విషాదం, పాముకాటుకు గురై 7వ తరగతి బాలిక మృతి
Medak News : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటులో 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో బాలిక పాము కాటుకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు మెదక్ ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది.
Medak News : మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలిక పాముకాటుకు గురై మృతి చెందింది. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (బి) గ్రామానికి చెందిన వైష్ణవి (12) 7వ తరగతి చదువుతుంది. శుక్రవారం రాత్రి ఆమె కుటుంబీకులతో కలిసి భోజనం చేసింది. అనంతరం అందరూ ఇంట్లో నిద్రపోయారు.
శుక్రవారం అర్ధరాత్రి వైష్ణవి కుడి కాలుకి ఏదో కరిచిందని తల్లిని లేపి చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు లేచి చుట్టూ చూసేసరికి పాప పడుకున్న సమీపంలో పాము కనిపించింది. వెంటనే పామును చంపేశారు. దీంతో వారు పాము కరిచి ఉండవచ్చని భావించి రాత్రి 2 గంటల సమయంలో మెదక్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వైష్ణవి శనివారం ఉదయం మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. వైష్ణవి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సంగారెడ్డిలో మరో వ్యక్తి
పాము కాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంగి (కె) గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగి (కె) గ్రామానికి చెందిన కోటగిరి సంతోష్ (25) ప్లంబింగ్ పనులు చేసుకుంటూ 8 సంవత్సరాలుగా భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే గ్రామానికి వచ్చిన సంతోష్ దంపతులు తమ వ్యవసాయ పొలంలో బోరు వేసి పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే బుధవారం రాత్రి కూడా పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన సంతోష్, పొలం వద్ద ఉన్న గుడిసెలో నిద్రించాడు. ఆ సమయంలో పాము కాటుకు గురై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బుధవారం రాత్రి పొలానికి వెళ్లిన భర్త గురువారం ఉదయం వరకు రాలేదు. దీంతో భార్య కవిత, అత్త సాయవ్వతో కలిసి చేనుకి వెళ్లింది. పొలం వద్ద ఉన్న గుడిసెలో సంతోష్ పడి ఉండడంతో, వారు ఎంత లేపిన లేవలేదు. అతని చేతికి పాము కాట్లు ఉండడం వారు గమనించారు. దీంతో పాము కాటుకు గురై మృతి చెందినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. మృతుడు సంతోష్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు మృతి చెందడంతో భార్య, పిల్లలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడి భార్య కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం