Ponnam Prabhakar : హుస్నాబాద్ అభివృద్ధే నా ప్రాధాన్యత, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించను- మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar : హుస్నాబాద్ అభివృద్ధే తన ప్రాధాన్యత అని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
Minister Ponnam Prabhakar : హుస్నాబాద్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఇఓలు, అన్ని శాఖల ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధే తన ప్రాధాన్యత అని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం కానీ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని చేసే పనిలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. ఈ నియోజకవర్గం మూడు జిల్లాలతో కూడి ఉందని, నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నది తన సిద్ధాంతమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని ప్రజాపాలన కార్యక్రమం తర్వాత జనరల్ పిటిషన్స్ తగ్గాయన్నారు. మంజూరైన పనులు, వాటిలో ఇప్పటికి ప్రారంభం కాని పనులు, ప్రారంభమై వివిధ స్థాయిలో ఉన్న పనుల వివరాలను తెలపాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20న మరొకసారి అన్ని శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల వివరాలపై సమీక్షిస్తానన్నారు.
హుస్నాబాద్ అభివృద్ధికి రూ.10 కోట్లు
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని, వాటితో ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుదామని మంత్రి పొన్నం తెలిపారు. వాటికి ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని, నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాలను కలిపే రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జిలు, బీటీ రోడ్ రెన్యువల్, విద్యుత్ అవసరాలు అన్ని వివరాలను సేకరించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని 305 ఆవాసాలలో రాబోయే ఎండాకాలంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో పాటు తహసీల్దారులు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విధానాలు వేరువేరుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కూడా అధికారులు సేకరించి అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. విద్యార్థి నాయకునిగా పనిచేసినందున తనకు విద్య వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. మండల స్థాయి అధికారులు మండలంలోని అన్ని రకాల గురుకుల విద్యాసంస్థలు, వసతి గృహాలను, మోడల్ స్కూల్ లను విజిట్ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వసతి, ఎడ్యుకేషన్ క్వాలిటీని పరిశీలించాలని సూచించారు.
హుస్నాబాద్ లోనే లైసెన్సులు ఇచ్చే ఏర్పాటు చేయండి
మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా చేపట్టిన నిర్మాణాల వివరాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని తహసీల్దార్ లు వివాదాస్పద భూముల వివరాలు, భూ రిజిస్ట్రేషన్ల వివరాలు అందించాలన్నారు. ప్రజలకు అందించే వివిధ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించాలన్నారు. రవాణా శాఖ నియోజకవర్గంలోని ప్రజలకు హుస్నాబాద్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు చేయాలని మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని నేషనల్ హైవే నిర్మాణం సందర్భంగా ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు అందించాలని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడి పనిచేసే దానిలో ఉన్న తృప్తి దేనిలో ఉండదు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మంచివారు. మొదటి తేదీకే జీతాలు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ బెన్ సాలెం, హనుమకొండ, హుజురాబాద్ ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.